తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతోంది.. అదే ‘TRS’. గులాబీ బాస్ కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ (BRS) గా మార్చినప్పటి నుంచీ, ఒరిజినల్ 'టీఆర్ఎస్' సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కానీ, ఆమె వేసిన ప్లాన్‌కు ఇప్పుడు ఊహించని బ్రేకులు పడుతున్నాయి.
కవిత ప్రతిపాదించిన "తెలంగాణ రక్షణ సేన" (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏకంగా 700కు పైగా అభ్యంతరాలు రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. నిజానికి కవిత ఈ పార్టీ పేరు ప్రకటించడానికి ముందు నుంచే కథ రకరకాల మలుపులు తిరిగింది. గత నెలలో జరిగిన ఒక సమావేశంలో ఆమె నోటితో టీఆర్ఎస్ అని ప్రకటిస్తే, వెనుక ఉన్న స్క్రీన్లపై మాత్రం "తెలంగాణ రాష్ట్ర సేన" అని కనిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే దాన్ని "తెలంగాణ రక్షణ సేన"గా మార్చారు. రోజుల వ్యవధిలోనే ఇలా పేరు మారుస్తూ రావడం ఒకెత్తయితే.. ఇప్పుడు అసలు ఈ పేరే కేటాయించవద్దంటూ వందల సంఖ్యలో అభ్యంతరాలు రావడం కవితకు పెద్ద తలనొప్పిగా మారింది.
కవితకు వచ్చిన అసలు చిక్కంతా మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ అనే నేత రూపంలో వచ్చింది. కవిత అధికారికంగా తన పార్టీ పేరును ప్రకటించడానికి కేవలం ఒక్క రోజు ముందే.. ఆయన "తెలంగాణ రాష్ట్రసామాజిక సేన" (TRS) అనే పేరును తనకు కేటాయించాలంటూ ఈసీ తలుపు తట్టారు. రెండు పార్టీల షార్ట్ ఫామ్స్ ఒకేలా ఉండటంతో ఇప్పుడు ఈసీ వద్ద పెద్ద టైటిల్ వార్ మొదలైంది. ఒకవైపు మహారాష్ట్ర(Maharashtra) నేత నుంచి పోటీ, మరోవైపు వందలాది అభ్యంతరాలు.. వెరసి కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళంలో పడింది.
తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అనే మూడక్షరాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సెంటిమెంట్‌తోనే రీ-ఎంట్రీ ఇవ్వాలని కవిత భావించారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈసీ అంత సులభంగా ఈ పేరును కవితకు కేటాయించేలా కనిపించడం లేదు. మరి ఇన్ని అడ్డంకుల మధ్య కవిత(Kavitha) తన పంతం నెగ్గించుకుని టీఆర్ఎస్ పేరును దక్కించుకుంటారా? లేక వివాదాలు ఎందుకని మరో కొత్త పేరుతో ముందుకు వస్తారా? అనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న.