తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కాలం వరకు రైతులు, నిరుద్యోగులు ఇతర వర్గాలను ఆధారంగా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారని, రైతులకు మేలు చేస్తున్నామని, బీఆర్ఎస్ హయాంలో ఈ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆవేదనకు గురయ్యాయని విమర్శించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళల కేంద్రంగా రేవంత్ రెడ్డి కీలకం వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు చేసిన మోసం అంతా ఇంతా కాదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వారికి వడ్డీ రహిత రుణాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్.. కనీసం వారిని పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. మహిళలను మోసం చేసిన ఏ నాయకుడైనా రాజకీయాలు చేయగలిగారా.. అని ప్రశ్నించారు. మహిళలతో పెట్టుకున్నందుకే కేసీఆర్ ఘోరంగా ఓడిపోయారని, చావుదెబ్బతిన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్న రేవంత్ రెడ్డి అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపేట వేసిందని తెలిపారు.
తన మంత్రివర్గంలోనే మహిళలు మంత్రులుగా ఉన్నారని.. కేసీఆర్ పాలనలో తప్పని పరిస్థితుల్లో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు తప్ప మనస్పూర్తిగా ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇక మహిళా స్వయం సంఘాలను బలోపేతం చేసే విషయంలోనూ తమ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెప్పారు. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాలను పూర్తిగా విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.
తాజాగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా స్వయం సంఘాలకు 500 కు పైగా బస్సులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళలకు చేస్తున్న మేలును సంపూర్ణంగా వివరించారు. సాగు నుంచి విద్య వరకు, ఆర్థికం నుంచి గృహం వరకు అన్ని విధాలా మహిళలకు మేలు చేస్తున్నామన్నారు. కాగా.. తాజా వ్యాఖ్యలతో మహిళల కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు ప్రారంభించారన్న చర్చ సాగుతోంది. త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.