తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడున్నారు.. అనే విషయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల ఆయన కుమారుడు భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యం తెలిసిందే. అనంతరం కొన్నాళ్లపాటు బండి సంజయ్ మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత ఫ్లెక్సీల వివాదం తలెత్తడంతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదానికి సంబంధించి బండి సంజయ్ ప్రధాన అనుచరుడు రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ పరిణామాలకు తోడు బండి కుమారుడుపై కేసు నమోదైన వ్యవహారం జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దిమారం రావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు సానుకూలత తగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రస్థాయిలో బిజెపి నాయకులు బండి సంజయ్ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో బండి వ్యవహారం ఇబ్బందుల్లో పడిందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ప్రస్తుతం గత నాలుగు రోజులుగా బండి సంజయ్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.
అంతేకాదు.. పార్టీ తరఫున నిర్వహించాలని నిర్ణయించిన కీలక కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీ అధిష్టానం నుంచి అనుమతి కూడా దక్కలేదని ప్రచారం జరుగుతోంది. ఈ కారణాల నేపథ్యంలోనే బండి సంజయ్ దూరంగా ఉన్నారని సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా కీలక సమయంలో బండి సంజయ్ దూరంగా ఉండడం, మరోవైపు ఆయన అనుచరుడు అరెస్ట్ కావడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.
ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన సంజయ్ ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారని కూడా పార్టీలో చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణ బిజెపిలో బండి సంజయ్ వ్యవహారం హాట్ టాపిక్ మారింది అని చెప్పాలి. అసలు ఏం జరిగిందనేది తెలియాలంటే బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది.