మీనాక్షి నటరాజన్ కు భారీ షాక్..

admin
Published by Admin — June 10, 2026 in Telangana
News Image

అందుకే అంటారు రాజకీయాల్లో అవకాశాలు మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలని. అన్ని ఉన్నా అదృష్టం అర శాతం లేకున్నా.. వచ్చిన అవకాశాలు ఇట్టే చేజారతాయన్న మాటకు నిలువెత్తు ఉదాహరణగా తాజా ఉదంతం నిలుస్తుందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఎంతో ముఖ్యం. తీవ్రమైన పోటీలో కిందా మీదా పడి టికెట్ కేటాయించినప్పుడు.. ఆ విషయంలో ఎంతో కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది.

అందుకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహరించిన తీరు.. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం చేజారటమే కాదు.. కాంగ్రెస్ ఖాతాలో ఒక ఎంపీ కోల్పోవాల్సి వచ్చిన దుస్థితి. ఇంతకూ అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? అసలేం జరిగింది? ఇందులో మీనాక్షి చేసిన తప్పేంటి? బీజేపీ చేసిన కంప్లైంట్ ఏంటి? అన్న విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

రాజ్యసభ ఖాళీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తనకు లభించే రాజ్యసభ స్థానాలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించటం తెలిసిందే. అందులో మీనాక్షి నటరాజన్ ఒకరు. ఆమెను మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. ఇందుకు తగ్గట్లే మీనాక్షి తన రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ విషయానికి వస్తే.. అక్కడ మొత్తం230 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి సొంతంగా 165 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకోవటానికి 58 ఎమ్మెల్యేల బలం అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ తనకున్న ఎమ్మెల్యేల బలంగా ఒక సీటును సొంతం చేసుకోవటం చాలా తేలిక.

ఇంతవరకు బాగానే ఉన్నా.. బీజేపీ వద్ద ఉన్న 165 మంది ఎమ్మెల్యేలకు మూడో రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకోవటానిక అవసరమైన ఎమ్మెల్యేల్లో మరో 9 మంది అవసరం. ఇలాంటి వేళ.. తాము మూడో స్థానాన్ని సొంతం చేసుుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా రాష్ట్ర బీజేపీ సీనియర్ మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ చేయించటం ద్వారా.. రాజ్యసభ స్థానాన్ని సొంతం చేసుకుంటారా? అన్న టెన్షన్ మొదలైంది. అదే సమయంలో బీజేపీ తన మూడో అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇలాంటి వేళలోనే.. అనూహ్య రీతిలో మీనాక్షి నామినేషన్ రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.

ఎందుకిలా అంటే.. మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ లో కీలక అంశాల్ని ప్రస్తావించలేదన్న విషయాన్ని బీజేపీ కంప్లైంట్ చేసింది. ఆమె తనకున్న ఆస్తుల వివరాలతో పాటు.. తెలంగాణలో తనపై నమోదైన క్రిమినల్ కేసు వివరాల్ని కూడా పొందుపర్చలేదన్న విషయాన్ని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉండే వారు.. తమకు సంబంధించిన అన్ని వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిబంధనలకు అనుగుణంగా మీనాక్షి వ్యవహరించని కారణంగా ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఆమె స్థానంలో బీజేపీ బరిలో దించిన మూడో అభ్యర్థి సునాయాసంగా.. ఎలాంటి ఓటింగ్ అవసరం లేకుండా ఎంపీ అవుతున్న పరిస్థితి. అదే సమయంలో.. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందేందుకు పూర్తి అవకాశాలు ఉన్న మీనాక్షికి అవకాశం చేజారినట్లుగా చెప్పాలి.

ఈసీ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నామినేషన్ తిరస్కరించే బదులు.. నోటీసు ఇస్తే సరిపోతుందని.. దానికి సమాధానం ఇచ్చేవాళ్లమని.. అందుకు భిన్నంగా ఇలా వ్యవహరించటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. కానీ.. ఈ నిర్ణయం కారణంగా పెద్ద ప్రయోజనం ఉండదన్న మాట వినిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి.. రాజకీయాల్లో అవకాశాలే కాదు.. అదృష్టం కూడా అంతే అవసరమన్న మాట నిజమే కదూ?

 

Tags
Meenakshi natarajan rajyasabha candidates nomination
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News