విశాఖ ప్రమాదం.. రూ. 25 లక్షల పరిహారంతో పాటు..?

admin
Published by Admin — June 09, 2026 in Andhra
News Image

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌(Vizag Steel Plant)లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. విషయం తెలిసిన వెంటనే అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హుటాహుటిన స్పందించాయి. మంగళవారం ఉదయం నుంచే విశాఖపట్నంలో మంత్రులు, రాజకీయ నేతల తాకిడి పెరిగింది. బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ సహా పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

ప్రమాదస్థలిని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బాధితుల కుటుంబాలను ఓదార్చిన ఆయన, కూటమి ప్రభుత్వం తరఫున కొండంత అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక నష్టపరిహారాన్ని ప్రకటించడంతో పాటు, ఆయా కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా, క్షతగాత్రుల ఆస్పత్రి చికిత్స ఖర్చుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

కేవలం తక్షణ సాయంతోనే సరిపెట్టకుండా, బాధిత కుటుంబాల లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు పదవీ విరమణ ప్రయోజనాల కింద ఏకంగా రూ. 1.72 కోట్ల భారీ మొత్తాన్ని అందజేయడానికి నిబంధనలు ఖరారు చేసింది. అదేవిధంగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు(Contract Worker Families) రూ. 45.75 లక్షల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.

ప్లాంట్‌లోని రెగ్యులర్ ఉద్యోగుల పిల్లలతో సమానంగా, మరణించిన కార్మికుల పిల్లల చదువులు ఎక్కడా ఆగిపోకుండా వారి విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించి ముందుకు నడిపిస్తుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను వెలికితీసేందుకు ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. బొకారో స్టీల్ ప్లాంట్ నుండి ఒక ఉన్నత స్థాయి 'త్రీ మ్యాన్ కమిటీ(Three-man committee)'ని రంగంలోకి దించుతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.

Tags
Vizag Steel Plant Pawan Kalyan Vizag Accident Steel Plant Blast Andhra Pradesh Vizag News AP Govt Nara Lokesh
Recent Comments
Leave a Comment

Related News