రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం.. ఈ నెల 8వ తేదీ తో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తికానుంది. ఈ నెల 18న పోలింగ్ కూడా జరగనుంది. దీని ని బట్టి ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభసీట్లకు నామినేషన్లు వేసేందుకు.. కేవలం రెండు రోజు లు మాత్రమే గడువు ఉంది. తాజాగా ఈ నాలుగు సీట్ల వ్యవహారంపై పంపకాలు కూడా పూర్తయ్యాయి.
నాలుగు స్థానాల్లో మిత్రపక్షం జనసేనకు ఒక సీటు ఇచ్చిన టీడీపీ.. మిగిలిన మూడు స్థానాలను తనే పోటీ చేయనుంది. తద్వారా.. రాజ్యసభలో టీడీపీకి సంఖ్యాబలం పెరగనుంది. అయితే.. మూడు స్థానాలకు దాదాపు 12 మంది వరకు `కీలక` నాయకులు బరిలో ఉన్నారు. తామంటే తామేనంటూ.. నాయకులు తల పడుతున్నారు. సీఎం చంద్రబాబు నుంచి మంత్రి లోకేష్ వరకు అందరికీ సిఫారసులు చేస్తున్నారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో త్యాగాలు చేసిన వారు సహా.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేవారు కూడా ప్రస్తుతం రాజ్యసభ సీటుపై కన్నేశారు. వీరికితోడు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు..కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే జరిగితే.. టీడీపీకి మిగిలేది రెండు స్థానాలు. ఆ రెండు స్థానాలలో ఒకదానికి గాను లోకేష్ సన్నిహితుడు రాజేష్ కిలారు పేరు ఖాయమని టాక్ వస్తోంది. మరో స్థానంలో చింతకాయల విజయ్ కి ఛాన్స్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ఇంకో సీటు సాన సతీష్ కు ఫిక్స్ అయిందని టాక్ వస్తోంది.
ఈ క్రమంలో ఇంత మంది ఆశావహులను చంద్రబాబు ఎలా సంతృప్తి పరుస్తారన్నది చూడాలి. సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు, మహిళా కోటా, సీనియార్టి, యువనేతలు ఇలా.. అనేక అంశాలు ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటన్నింటినీ దాటుకుని అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చంద్రబాబు ముందున్న సమయం కేవలం 2 రోజులే కావడం గమనార్హం. మరి ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరిని పెద్దల సభకు పంపిస్తారన్నది చూడాలి.