సుప్రీంకోర్టు అంటే.. దేశంలోని అన్ని హైకోర్టులకు బాస్!. కేవలం హైకోర్టులకే కాదు.. దేశంలోని అన్ని న్యాయ వ్యవస్థలకు కూడా సుప్రీంకోర్టు యజమాని. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు, చేసే ఆదేశాలు దిగువన ఉన్న కోర్టులు పాటిస్తాయి. ఇక, ఈ కోర్టులు ఇచ్చే తీర్పులను సమీక్షించేందుకు.. అవసరమైతే కొట్టేసేం దుకు కూడా.. సుప్రీంకోర్టుకు అన్ని హక్కులు , అధికారాలు కూడా ఉన్నాయి. అలాంటి సుప్రీంకోర్టుపై తొలిసారి మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
``మీరే ఇలా చేస్తారా? ఇలా అయితే.. మిగిలిన కోర్టుల పరిస్థితి ఏంటి? కేసుల పరిస్థితి ఏంటి? మీరే ఒక మాట చెప్పి.. దానిని మీరే పాటించకపోతే.. ఇక, మిగిలిన కోర్టులు ఎలా నడుచుకోవాలి?`` అని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. సాధారణంగా.. సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాల విషయంలో హైకోర్టులు కామెంట్ చేయవు. అలాంటిది దేశ చరిత్రలో తొలిసారి దిగువ కోర్టు.. సుప్రీంకోర్టును విమర్శించడం సంచలనంగా మారింది.
ఏం జరిగింది?
తమిళనాడులో 2016లో జరిగిన ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే నేత ఇన్బదురై గెలిచారు. అయితే.. ఇక్కడ నుంచి ఓటమిపాలైన డీఎంకే నేత.. అప్పావు కోర్టును ఆశ్రయించారు. ఇన్బదురై.. కేవలం 49 ఓట్ల మెజారిటీతోనే గెలిచారని.. పేర్కొంటూ దీనిని సవాల్ చేస్తూ.. తొలుత హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్ పోస్టల్ ఓట్లలో తేడా జరిగిందని ఆరోపించారు. దీనిని విచారించిన కోర్టు.. అంతా బాగానే ఉందని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అప్పటి నుంచి ఈ కేసు తేలలేదు. సుప్రీంకోర్టులో పెండింగులోనే ఉంది. దాదాపు పది సంవత్సరాలు అయినా కూడా ఈ కేసు తేలకపోవడంపై ఇన్బుదురై.. మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భం గా మద్రాస్ హైకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల పిటిషన్లను 6 నెలలలోపు విచారించి తీర్పును ఇవ్వాలన్న గత సుప్రీంకోర్టు ఆదేశాలను ఉటంకించిన ధర్మాసనం.. ఈ నియమాన్ని సుప్రీంకోర్టే ఉల్లంఘి స్తే.. దేశంలో నియంతృత్వం పెరిగిపోతుందని వ్యాఖ్యానించింది. అనంతరం.. అప్పావును విజేతగా ప్రకటించింది. అయితే.. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుపై మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.