రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో బలంగా ప్రస్తావిస్తానని, ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, కేంద్ర సహకారం వంటి అంశాలపై నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
ఎవరీ లింగమనేని?
లింగమనేని రమేష్.. ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త. 'ఎయిర్ కోస్టా` సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1983లో 'లింగమనేని ఎస్టేట్స్' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. దీనిలో సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు లింగమనేని అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. ఏపీ విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... కృష్ణా నది కరకట్టపై ఉన్న లింగమనేనికి చెందిన భవనంలోనే ఆయన అధికారిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
జనసేనకు..
ప్రస్తుతం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న స్థలం కూడా లింగమనేని రమేష్‌దే. ఆయనే పార్టీకి విరాళంగా ఇచ్చారని.. గతంలో జనసేన ప్రకటించింది. అంతేకాదు.. పార్టీ చేపట్టిన రాష్ట్ర స్థాయి ఉద్యమాలు, పర్యటనలకు కూడా లింగమనేని ఆర్థిక సాయం చేశారు. పార్టీ కార్యాలయంలో నిత్యం భోజనాల ఏర్పాటుకు అవసరమైన శాశ్వత నిధిని కూడా లింగమనేనే ఏర్పాటు చేశారు.
పారిశ్రామికవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయన చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని, అధికారికంగా జనసేన పార్టీ తరఫున ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ లింగమనేని రమేష్‌ను రాజ్యసభకు పంపడం వెనుక గల కారణాలు.. ఆయన పార్టీ పట్ల విధేయతతో వ్యవహరించడం.. పవన్ కల్యాణ్ అంటే అమితమైన అభిమానం ఉండడమే కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు.