బీజేపీకి గుడ్ బై.. అన్నామలై కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న‌..!

admin
Published by Admin — June 05, 2026 in Politics, National
News Image

తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం నమోదైంది. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత కె. అన్నామలై(Annamalai) కమలం పార్టీకి అధికారికంగా గుడ్ బై చెప్పారు. ఆయన సమర్పించిన రాజీనామాకు అధిష్టానం ఆమోద ముద్ర వేయడంతో.. తమిళ పాలిటిక్స్‌లో ఒక అధ్యాయం ముగిసి, మరో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రాజీనామా ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే మీడియా ముందుకు వచ్చిన అన్నామలై.. తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తూ సరికొత్త పార్టీ ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఢిల్లీ పెద్దలతో తనకు ఉన్న విభేదాలను అన్నామలై బాహాటంగానే అంగీకరించారు. గత 18 నెలలుగా పార్టీ అగ్రనాయకత్వంతో కొన్ని కీలక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తమిళనాడులో బీజేపీ(BJP) ఒంటరిగా పోరాడి తన సత్తా చాటాలని తాను బలంగా కోరుకున్నానని, కానీ అది ప్రాక్టికల్‌గా సాధ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను బీజేపీ వ్యక్తినా లేక తమిళుడినా? అనే ఒక బలమైన అంతర్మథనం తనలో జరిగిందని, చివరికి తన మాతృభూమి వైపే తన మొగ్గు అని ఆయన స్పష్టం చేశారు. నిజానికి గతేడాది డిసెంబర్‌లోనే తాను తప్పుకోవాలని భావించినప్పటికీ.. పార్టీ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వేచి చూశానని తెలిపారు.

తాను బీజేపీకి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అన్నామలై.. తనతో నడిచిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఆయన ప్రస్థానం ఇక్కడితో ఆగడం లేదు. తమిళ ప్రజల గొంతుకగా మారేందుకు సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమ కొత్త పార్టీ వ్యూహాలు ఉంటాయని టైమ్ లైన్ కూడా సెట్ చేసేశారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా వంటి పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, అన్నామలై తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు త‌మిళ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఒకప్పటి ఐపీఎస్ అధికారిగా, ఆపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడు ప్రదర్శించిన అన్నామలై.. ఇప్పుడు ఒంటరి పోరాటానికి సిద్ధమవ్వడం తమిళనాడు(Tamilnadu)లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి.

Tags
Annamalai K. Annamalai BJP Tamil Nadu Politics Annamalai New Party
Recent Comments
Leave a Comment

Related News