హైదరాబాద్ శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట, నార్సింగి భూములపై కన్నేసి.. నకిలీ పత్రాలతో ఏకంగా వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపిన కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ భారీ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో ప్రత్యేక బృందాలు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి.
గండిపేట పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందిన అత్యంత విలువైన భూములను కొల్లగొట్టేందుకు నిందితులు వేసిన స్కెచ్ అధికారులనే విస్మయానికి గురిచేసింది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులను సృష్టించి, ఆ భూములు తమవేనంటూ నమ్మించి విక్రయించేందుకు బ్రహ్మనాయుడు(Bolla Brahma Naidu), ఆయన అనుచరులు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెగా స్కామ్ విలువ దాదాపు రూ.1,500 కోట్లకు పైనే ఉంటుందని రెవెన్యూ, పోలీస్ వర్గాల ప్రాథమిక అంచనా.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ కుంభకోణం వెనుక మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారనే బలమైన ఆధారాలు లభించాయి. ఇక తమపై కేసు నమోదైందనే విషయం తెలియగానే బ్రహ్మనాయుడు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన హైదరాబాద్(Hyderabad) పోలీసులకు, ఆయన తమిళనాడులోని కాంచీపురంలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ ఆయనను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మనాయుడిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు విచారణను మరింత తీవ్రతరం చేయనున్నారు.