తెలంగాణలో పోటీ చేస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా తనతోపాటు పార్టీ నాయకులు తిరుగుతారని జనసేన అధిపతి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు పోటీ చేయాలని అనుకోలేదన్న ఆయన.. ఇప్పుడు తనపై చేస్తున్న వ్యాఖ్యలు.. తనను వ్యతిరేకిస్తున్న తీరును గమనించాక.. తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని.. తెలంగాణను విభజించిన తీరుకే వ్యతిరేకమని అన్నారు. పార్లమెంటు తలుపులు మూసి విభజించారన్నదే తన వాదన అని తెలిపారు.
ఈ దేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమని పవన్ అన్నారు. ఎవరో బెదిరిస్తే.. తాను బెదిరేది లేదని.. అన్నారు. గతంలో తెలంగాణను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు పదవుల్లో ఉన్నారని, ఎమ్మెల్యేలు కూడా అయ్యారని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించారని.. కానీ, ఆయనకే ఊడిగం చేశారని గుర్తు చేశారు. తాను ఎవరినీ రెచ్చ గొట్టలేదని తెలిపారు. అయితే.. ఓ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలతోనే వివాదం మొదలైందని.. ఇలాంటి విశ్లేషణల వల్లే కమ్యూనిజం కూడా చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. అలాంటి విశ్లేషణలకు సమాధానం చెప్పుకొనే స్వేచ్ఛ కూడా నాకు ఉండదా అని ప్రశ్నించారు.
కోడి చెరువు భూములను ఆక్రమించుకున్నట్టు వస్తున్న ఆరోపణలపైనా పవన్ రియాక్ట్ అయ్యారు. తాను ఆక్రమించుకున్నట్టు నిరూపణ అయితే.. సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని తాను ఇదే కోరుతున్నట్టు తెలిపారు. ఇక, బీఆర్ ఎస్‌పైనా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నుంచి గతంలో కొందరు నేతలను బీఆర్ ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారని.. అయినా తాను సహించానని చెప్పారు. ఇప్పుడు తాను తెలంగాణకు వస్తే ఏదో చేస్తామని హెచ్చరిస్తున్నారని .. కానీ, తనకు ఏపీలోనే బెదిరింపులు ఎక్కువని అన్నారు. కోనసీమలోనే తన తల తీస్తానని కొందరు బెదిరించారని చెప్పుకొచ్చారు. అయితే.. తాను బెదిరే టైపు కాదని అన్నారు.
ఇక్కడి ప్రజలు మంచోళ్లు..
తెలంగాణ ప్రజలు మంచి వాళ్లని పవన్ వ్యాఖ్యానించారు. వారికి విధ్వేషం తెలియదని చెప్పారు. ఏపీ ప్రజలను కూడా వారు ప్రేమిస్తారని అన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రజలు విధ్వేషం చూపితే ఏపీ వాళ్లు ఇక్కడ తిరగగలిగే వారే కాదని చెప్పారు. తనకు తెలంగాణ కొత్తకాదన్న పవన్.. ఇప్పుడు తనను విమర్శించే వారికంటే కూడా తెలంగాణలోని నలుమూలల్లో తాను తిరిగానని చెప్పారు. తాను తెలంగాణలోనే పార్టీ పెట్టానని.. ఇక్కడి ప్రజలే తనను ఆదరించారని తెలిపారు. వారాహి యాత్రను ఏపీలో అడ్డుకుంటామని అన్నారని గుర్తు చేసుకున్నారు. కానీ, తెలంగాణ ప్రజలు వారాహి యాత్రను కూడా స్వాగతించారని తెలిపారు. తెలంగాణలో పార్టీని విస్తరిస్తామని.. ఇక్కడ కూడా పోటీ చేసి తీరుతామని తెలిపారు