తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సంచలనం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా ప్రకటన రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. వచ్చే ఏడాది, అంటే 2027 నుంచి జనంలోకి వెళ్లబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఆయన భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు త్వరలోనే ముహూర్తం ఖరారు కానుండటంతో, గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
అయితే, ఈ పాదయాత్ర ప్రకటనతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే... పాదయాత్ర సెంటిమెంట్. తెలుగు రాజకీయాల చరిత్రను తిరగేస్తే ఒక బలమైన సెంటిమెంట్ కనిపిస్తుంది. జనం నాడి పట్టుకోవడానికి, అధికారం దక్కించుకోవడానికి పాదయాత్ర అత్యంత శక్తివంతమైన అస్త్రంగా నిరూపితమైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) కూడా ఇదే బాటలో నడిచి సంచలన విజయాలు నమోదు చేశారు. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర ద్వారానే మైలేజ్ సాధించి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి సీఎం అయ్యారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని కేటీఆర్ నమ్ముకోవడం విశేషం.
ఈ పాదయాత్ర కేవలం ఒక నిరసన కార్యక్రమంలా కాకుండా, పక్కా పొలిటికల్ మైలేజ్ తెచ్చేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) స్వయంగా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గాన్ని తాకేలా, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేలా కేసీఆర్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరును, ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగనుంది.
కేటీఆర్ పాదయాత్ర ప్రకటనతో అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. పాదయాత్రలు చేసే నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడతారనే సెంటిమెంట్ ఉండటంతో, దీనిని ఎలా కౌంటర్ చేయాలనే దానిపై కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే లెక్కలు వేస్తున్నాయి. కేటీఆర్(KTR) జనంలోకి వస్తే రాబోయే ఎన్నికల నాటికి సమీకరణాలు పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన అధికార పక్షం, ఆయన ప్లాన్‌ను తిప్పికొట్టే వ్యూహాలపై దృష్టి పెట్టింది. మరి వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డిలకు వర్తించిన సీఎం సెంటిమెంట్ 2027లో కేటీఆర్‌కు కూడా కలిసి వస్తుందా? కేటీఆర్ పాదయాత్ర తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మార్చబోతోంది? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.