ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ సభకు అనుమతినివ్వలేమని పోలీసులు చెప్పారు. దీంతో, సభకు అనుమతినివ్వాలని కోరుతూ జనసేన హైకోర్టును ఆశ్రయించింది. జనసేన దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. హౌస్ మోషన్ పిటిషన్ కింద విచారణ జరపాల్సిన తీవ్రత ఇందులో లేదని ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.
మరోవైపు, ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4.30 కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. తాజాగా కోర్టు కూడా జనసేన పిటిషన్ కొట్టివేయడంతో పవన్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. అంతకుముందు, తన ప్రెస్ మీట్ పై కూడా పవన్ సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది. సభకు అనుమతి నిరాకరించారు..కనీసం ప్రెస్ మీట్ కైనా అనుమతిస్తారా అంటూ పవన్ అన్నట్లు టాక్.
కాగా, పవన్ నిర్వహిస్తోంది బహిరంగ సభ కాదని, 2 వేల మంది జనసేన కార్యకర్తలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ అని జనసేన నేతలు అంటున్నారు. ఇటువంటి అంతర్గత సభకు అనుమతి నిరాకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో పవన్ అనే చిచ్చుబుడ్డి పెట్టాలని బీజేపీ చూస్తోందని తెలంగాణ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు.