అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి(Thopudurthi Prakash Reddy) సోదరుడు, వైసీపీ కీలక నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఒక యువకుడి ఆత్మహత్యకు కారణమయ్యారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ యాక్షన్ తీసుకోవడం స్థానికంగా పెను సంచలనంగా మారింది. రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా ప్రకటించారు.
ఈ వివాదానికి మూలాలు సోషల్ మీడియా వేదికగా జరిగిన ఘర్షణల్లో ఉన్నాయి. గతంలో తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన రాజశేఖర్ రెడ్డి, సదరు యువకుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సదరు నేతల నుంచి వచ్చిన బెదిరింపులను తట్టుకోలేక, తీవ్ర మనస్తాపానికి గురైన మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి మలిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు ప్రాణాలు పోవడానికి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి(Thopudurthi Rajasekhar Reddy) బెదిరింపులే కారణమంటూ కొన్ని కీలక ఆడియో, వీడియో ఆధారాలను కూడా ఆయన పోలీసులకు అందజేశారు.
మొదట ఈ ఉదంతంపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలు, తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణను అనంతపురం రూరల్, రాప్తాడు పోలీసులకు అప్పగించారు. సంయుక్తంగా రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు లోతైన దర్యాప్తు జరిపాయి. మృతుడి కుటుంబం సమర్పించిన డిజిటల్ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే ఈ అరెస్టులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పట్టున్న తోపుదుర్తి కుటుంబానికి చెందిన కీలక నేత ఇలా లాకప్‌లోకి వెళ్లడం వైసీపీ(YCP) శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ అరెస్ట్ ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.