ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయ క్షేత్రంలో మే 27వ తేదీ అత్యంత కీలకమైన మైలురాయిగా మారబోతోంది. సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత.. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ఒకే రోజున తమ భవిష్యత్ వ్యూహాలకు పదును పెట్టేందుకు సిద్ధమవడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘మహానాడు’ వేడుకలు, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోయే అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం.. ఈ రెండూ ఒకే రోజున షెడ్యూల్ కావడంతో అందరి దృష్టి ఈ పరిణామాలపైనే నిలిచింది.
తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ప్రకారం ప్రతీ ఏటా నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు ‘మహానాడు(Mahanadu)’ నిర్వహిస్తారు. అయితే, ఈసారి టీడీపీ సరికొత్త పంథాను ఎంచుకుంది. దేశవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణాలు, పొదుపు మంత్రాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మహానాడును పూర్తిగా వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 27న ప్రారంభమై, 28న ముగిసే ఈ డిజిటల్ సదస్సులో పార్టీ క్యాడర్‌కు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఎక్కడికక్కడ ప్రాంతీయంగానే నేతలు, కార్యకర్తలు కంప్యూటర్ స్క్రీన్ల ముందుకు చేరి ఈ వేడుకల్లో భాగస్వాములు కావడం ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరలేపుతోంది.
సరిగ్గా అదే రోజున (మే 27న) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) సైతం ఒక భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఇంతటి భారీ స్థాయి అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఈ భేటీకి కేవలం ముఖ్య నేతలు మాత్రమే కాదు.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు అందరూ హాజరవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది వైసీపీ ఫ్యూచర్ రోడ్ మ్యాప్‌ను డిసైడ్ చేసే మీటింగ్ అని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వంపై ఎలా పోరాడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే అంశాలపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు.
ఈ రెండు సమావేశాల వెనుక ఉన్న అసలు సస్పెన్స్.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, చివరగా గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని కూటమి సర్కార్ యోచిస్తోంది. పట్టణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల వైపు ఎన్నికల సమరాన్ని తీసుకెళ్లడం ద్వారా 100% స్ట్రైక్ రేట్ సాధించాలని అధికార కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతంలో వైసీపీ(YCP) సాధించిన రికార్డులను తిరగరాయాలని కూటమి చూస్తుంటే, వారి దూకుడుకు ఎలా చెక్ పెట్టాలనే సవాల్‌పై వైసీపీ ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించనుంది.
పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలని జగన్ ఎన్ని డెడ్‌లైన్లు పెట్టినా, చాలా నియోజకవర్గాల్లో పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ మీటింగ్‌లో జగన్ దీనిపై సీరియస్ రివ్యూ చేయబోతున్నట్లు టాక్. ఎక్కడెక్కడ లోపాలున్నాయి? ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అనే డేటాతో జగన్ రెడీగా ఉన్నారట. స్థానిక ఎన్నికల యుద్ధం ముంచుకొస్తున్న వేళ.. బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేయని నేతలకు గట్టి క్లాస్ పీకే అవకాశం ఉంది. మొత్తానికి, మే 27న ఒకవైపు చంద్రబాబు(Chandrababu) డిజిటల్ కేక.. మరోవైపు జగన్ పొలిటికల్ క్లాస్.. ఈ రెండింటితో ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!