ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తున్న ముగ్గురు అగ్ర నేతలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ముగ్గురు దిగ్గజాలు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులను లోకేష్ ‘75 ఏళ్ల కుర్రాళ్లు’ అంటూ అభివర్ణించారు. వీరికి 75 ఏళ్లు పైబడుతున్నా, వీరిలో పని చేసే ఉత్సాహం మాత్రం 25 ఏళ్ల యువకుడిలా ఉంటుందని ప్రశంసించారు. ఈ ముగ్గురు నేతలు దూసుకుపోతున్న స్పీడ్‌ని అందుకోవడం ఎవరి తరం కాదని, వారి వేగం చూస్తుంటే తనకే ఆశ్చర్యం వేస్తుందని లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురి కలయిక దేశానికి, రాష్ట్రానికి ఒక పవర్‌ఫుల్ కాంబినేషన్ అని ఆయన కొనియాడారు.
రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ భూమిపూజ కార్యక్రమం పుట్టపర్తిలో ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి మంత్రి లోకేష్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ భారీ ప్రాజెక్టుతో ఉమ్మడి అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని, రాయలసీమ ప్రాంతంలో రక్షణ రంగ పెట్టుబడులతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువత ఈ గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకోవద్దని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా దేశ భద్రత విషయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను లోకేష్ గుర్తుచేశారు. గతంలో పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పిన 'ఆపరేషన్ సిందూర్' వెనుక ఉన్న అసలైన శక్తి రాజ్‌నాథ్ సింగేనని కొనియాడారు. ఆయన్ను దేశపు నిజమైన 'ఐరన్ మ్యాన్' గా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజన్ స్పీడ్‌తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.