ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బాపట్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన వేగేశ్న నరేంద్ర వర్మ రాజు(Vegesana Narendra Varma Raju) తొలినాళ్లలో బాగానే పని చేసినప్పటికీ.. ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన వెనుకబడ్డారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తొలిసారి ఆయన విజయం సాధించారు. టిడిపి తరఫున బలమైన నాయకుడిగా నియోజకవర్గంలో ఎదిగారు. నిజానికి ఒక కీలక నాయకుడు టిడిపి నుంచి పోటీ చేయాలని భావించినా ఆయనను కాదని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), అదే విధంగా మంత్రి నారా లోకేష్ లు అప్పట్లో వేగేశ్న నరేంద్ర వర్మను ఎన్నుకున్నారు. ఆయనకే టికెట్ ఇచ్చారు.
దీంతో కూటమి హవాలో దాదాపు 27 వేల కోట్ల మెజారిటీతో నరేంద్ర వర్మ విజయం సాధించారు. అప్పటికే ఆయన సామాజిక సేవా పరంగా బాపట్ల నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారు. వేగేశ్న ఫౌండేషన్(Vegesna Foundation) ద్వారా అనేక కీలక కార్యక్రమాలు కూడా అమలు చేశారు. మారుమూల ప్రాంతాలకు నీళ్లు ఇచ్చారు. పేదల్లో ఉన్న అవివాహితులకు ఆయన స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి వివాహాలు చేశారు. ఇలా సామాజిక సేవా పరంగా ఆయన పుంజుకున్నారు. ఇది గత ఎన్నికల్లో నరేంద్ర వర్మకు బాగా కలిసి వచ్చింది.
ఇక 2024 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఆయన గ్రాఫ్ అలానే కొనసాగింది. ప్రజల్లో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. మండలానికి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం ద్వారా టిడిపి(TDP)ని బలోపేతం చేశారు. టిడిపిని పటిష్టం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు చూసుకుంటే అంతర్గత కుమ్ములాటలు వేగేశ్న కు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఎంపీతో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటనలు కూడా ఉండడం లేదు.
మొత్తంగా నరేంద్ర వర్మ(Narendra Varma) గత రాజకీయాలతో పోల్చుకుంటే ప్రస్తుతం గత ఏడాది కాలంగా వెనుకబడ్డారని వాదన వినిపిస్తోంది. బాపట్ల నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ఆయనకు అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఇతర నాయకులతో ఉన్న విభేదాలు ఎమ్మెల్యేకు ప్రధాన అడ్డంకిగా మారాయి. మరువైపు అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు కూడా ఎమ్మెల్యేకు ఇబ్బందికర పరిణామాలను సృష్టిస్తున్నాయి. ఇవన్నీ దాటుకునే ఆయన పనిచేయాలి అని అనుకున్నప్పటికీ అధికారుల సహకారం కొరవడింది అన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. ఇలా ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ రాజకీయాలు ఒకింత వెనుకబడ్డాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా తాత్కాలిక మేనని త్వరలోనే నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు కుదుటపడతాయని నరేంద్ర వర్మ చెబుతున్నారు. మరి ఆయన ఏ విధంగా పుంజుకుంటారు.. పార్టీలో ఉన్న ఆధిపత్య రాజకీయాలను ఏ విధంగా గెలిచి ముందుకు సాగుతారు అనేది చూడాలి.