నాడు TDPకి సేవ‌లు.. నేడు TVK ఎమ్మెల్యేగా గెలుపు!

admin
Published by Admin — May 06, 2026 in Politics, National
News Image

రాజకీయాల్లోకి రావడం ఒకెత్తు అయితే, వచ్చిన అనతి కాలంలోనే చరిత్ర సృష్టించడం మరో ఎత్తు. సరిగ్గా ఇదే పనిచేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు కీర్తనా సంపత్. తమిళనాడు అగ్ర నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) నుంచి పోటీ చేసి, శివకాశి నియోజకవర్గ తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె సరికొత్త రికార్డు నెలకొల్పారు. అయితే, ఈ గెలుపు వెనుక ఆమె సాగించిన ప్రయాణం ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.

పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసిన కీర్తన, కెరీర్ ప్రారంభంలో అంకెలు, గణాంకాలతో కుస్తీ పట్టారు. ఆ నైపుణ్యమే ఆమెను దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (I-PAC) బృందంలో చేరేలా చేసింది. తెరవెనుక ఉండి బెంగాల్‌లో మమతా బెనర్జీకి, తమిళనాడులో ఎం.కె. స్టాలిన్‌కు గెలుపు వ్యూహాలు రచించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. అంకెలను విశ్లేషించడం ద్వారా ఓటర్ల నాడిని పట్టడంలో కీర్తన అప్పుడే ఆరితేరిపోయారు.

కీర్తన ప్రస్థానంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు హైదరాబాద్‌తో ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీ (TDP) సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు. ఆ సమయంలోనే తెలుగు భాషపై ఆమెకు పట్టు లభించింది. ఏపీ రాజకీయాల్లోని క్లిష్ట పరిస్థితులు, డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహణ ఆమెకు క్షేత్రస్థాయిలో రాజకీయాల పట్ల పూర్తి అవగాహన కల్పించాయి. నాడు టీడీపీ కోసం డిజిటల్ యుద్ధం చేసిన అదే అనుభవం, నేడు ఆమెకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బ్రహ్మాస్త్రంలా పనిచేసింది.

లక్షల జీతం, కార్పొరేట్ హోదా ఉన్నప్పటికీ, తన సొంత నియోజకవర్గమైన శివకాశిలో ఉన్న సమస్యలు కీర్తనను కలిచివేసాయి. ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లిన ఆమెను, తమిళ స్టార్ విజయ్(Vijay) గుర్తించారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా ఆమె ప్రతిభను నమ్మి శివకాశి టికెట్ కేటాయించారు. ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు బరిలోకి దిగిన కీర్తన, నియోజకవర్గంలోని తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడానికి తడబడకుండా తెలుగులో ప్రసంగించి అందరినీ అశ్చర్యపరిచారు.

తన వినూత్న ప్రచార శైలి, సోషల్ మీడియాలో యువతను ఆకట్టుకునే వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఫలితంగా శివకాశి నియోజకవర్గ చరిత్రలో శాసనసభకు ఎన్నికైన తొలి మహిళగా కీర్తనా సంపత్(Keerthana Sampath) నిలిచారు. ఆమె 68,709 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు చెందిన అశోకన్ జి ని 11,670 ఓట్ల తేడాతో ఓడించారు. రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునే ప్రతి యువతకు, డేటా అనలిస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన కీర్తనా సంపత్ ప్రయాణం ఇప్పుడు ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.

 

Tags
Keerthana Sampath TVK Vijay Sivakasi MLA Tamil Nadu Elections 2026 Thalapathy Vijay TVK Victory TDP
Recent Comments
Leave a Comment

Related News