సాధారణంగా ఏ ఇంట్లో అయినా పొద్దున్నే లేవగానే వంటగది నుంచి వచ్చే శబ్దాలు, పోపు వాసనలే ఆ ఇల్లు కళకళలాడుతుందని చెబుతుంటారు. కానీ, గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న చాందన్కీ(Chandanki) అనే గ్రామానికి వెళ్తే సీన్ రివర్స్‌లో ఉంటుంది. అక్కడ చాలా ఇళ్లలో వంటగదులు మూతపడ్డాయి. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది ఊరంతా కలిసి తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం. వృద్ధాప్యంలో ఒంటరిగా ఉంటూ వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల కోసం, ఆ ఊరి సర్పంచ్ పూనమ్‌భాయ్ పటేల్ ఒక అద్భుతమైన మార్గాన్ని వెతికారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు న్యూయార్క్‌లో నివసించిన పూనమ్‌భాయ్ పటేల్, తన గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఒక బాధాకరమైన నిజాన్ని గమనించారు. ఉపాధి కోసం యువత పట్టణాలకు వలస వెళ్లడంతో, గ్రామంలోని వృద్ధులు ఒక్కొక్కరుగా మిగిలిపోయారు. శారీరక శక్తి తగ్గిపోయి, ఒంటరిగా వంట చేసుకునే ఓపిక లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సామూహిక వంటశాల (Community Kitchen) అనే కాన్సెప్ట్‌ను ఆయన తెరపైకి తెచ్చారు. మొదట్లో కొందరు సందేహించినా, ఇప్పుడు ఆ ఊరంతా ఒకే కుటుంబంలా మారిపోయింది.
ఈ గ్రామంలోని సామూహిక వంటశాల కేవలం ఆకలి తీర్చడానికే కాదు, మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతోంది. అందరూ కలిసి సోలార్ విద్యుత్తుతో నడిచే, ఆధునిక ఏసీ హాల్‌లో కూర్చుని భోజనం చేస్తారు. రోజూ వేడివేడి రోటీలు, సబ్జీ, కిచిడీ వంటి సంప్రదాయ గుజరాతీ వంటకాలు వడ్డిస్తారు. కేవలం నెలకు రూ. 2000 చెల్లిస్తే చాలు.. పోషకాహారంతో పాటు పది మందితో కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఇదే ఆ వృద్ధుల మానసిక ఆరోగ్యానికి పెద్ద మందుగా పనిచేస్తోంది.
హార్వర్డ్ వంటి పెద్ద సంస్థలు సామాజిక బంధాల వల్ల మనుషులు ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారని చెబుతుంటాయి. ఆ విషయాన్ని చాందన్కీ గ్రామం ప్రాక్టికల్‌గా నిరూపిస్తోంది. అందుకే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఈ గ్రామం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అని కొనియాడారు. కేవలం భోజనం కోసమే కాకుండా, పది మందిని కలిసేందుకు ఈ ఊరి ప్రజలు వంటగదులకు స్వచ్ఛందంగా తాళాలు వేయడం నిజంగా గ్రేట్ కదా.