రాజకీయాల్లో కొత్త పార్టీలు పెట్టడం తేలికే. అయినప్పటికీ ప్రజల్లో విజయం సాధించడం ప్రజల మన్ననలను చూరకొనడం అనేది అంత తేలికైన విషయం కాదని తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Election) మరోసారి రుజువు చేసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టాలి అనుకునే వారికి తమిళనాడు ఎన్నికల ఫలితం ఒక కీలక మైలురాయిగా మారుతుందని కూడా చెబుతున్నారు. ఇటీవల ఏపీలో కొత్త పార్టీ పెడతాను అంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వైసిపి మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ఏపీ(AP)లో రాజకీయ గ్యాప్ ఉందని, ప్రజలకు సేవ చేసేందుకు మరింత అవకాశం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తను కొత్త పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి జూలైలో ప్రకటన చేస్తానని చెప్పారు. కొత్త పార్టీలు పెట్టడం తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఏ మేరకు కొత్త పార్టీలు ప్రజలను ఆకర్షిస్తాయి.. ఏ మేరకు నాయకులు ప్రజలకు చేరువ అవుతారు అనేది ప్రధాన ప్రశ్న. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీగా అవతరించిన ప్రముఖ నటుడు దళపతి విజయ్ రంగంలోకి దిగారు.
తమిళ వెట్రి కలగం(TVK) పేరుతో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో దాదాపు 229 స్థానాల్లో ఆయన పోటీ చేశారు. ఏ విధంగా విజయ్ ను స్వాగతించారు.. ఏ మేరకు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు అనేది ఆసక్తికర అంశం. దీనికి సంబంధించిన ఫలితాలు మే 4వ తేదీన విడుదల కానున్నాయి. అయితే దీనికి ముందు తాజాగా అత్యంత రాజకీయ వర్గాల్లో విశ్వసనీయంగా ఉన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. దీనిలో విజయ్ పార్టీకి పెద్దగా ఆదరణ లభించడం లేదని స్పష్టమైంది.
భారీ ఆశలతో భారీ అంచనాలతో రాజకీయాల్లోకి వచ్చి సినిమా రంగాన్ని సైతం వదులుకుంటానని ప్రకటించినప్పటికీ తమిళనాడు ప్రజలు పెద్దగా స్వాగతించలేదనేది స్పష్టమైనది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఫలితం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ ఎగ్జిట్ పోల్స్ పై ఉన్న నమ్మకం విశ్వాసాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న పరిణామాలను అంచనా వేస్తే విజయ్(Vijay) పరిస్థితి ఇబ్బందికరంగానే మారుతుంది. వాస్తవానికి కొత్త పార్టీలకు ప్రజలు బ్రహ్మరథం పడతారని అందరూ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా తమిళనాడు విజయ్ పరిస్థితి డోలాయమానంలో పడింది.
ప్రజల్లో ఆదరణ ఉన్న నటుడే అయినప్పటికీ ఆయనను రాజకీయంగా ప్రజలు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది అన్నది ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చాయి. దీనిని బట్టి మరి.. సాయి రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. కొత్తగా రాజకీయాల్లోకి రావడం కాదు, గెలుపు గుర్రం ఎక్కడం అనేది అత్యంత కీలకం. ప్రజల మధ్య ఉండడం ముఖ్యం. ప్రజలు ఆదరించడం అంతకన్నా ముఖ్యం. మరి విజయ్ అనుభవాలను బట్టి విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు.. ఏపీలో ఎలాంటి రాజకీయాలను ఆయన ఫేస్ చేస్తారో అనేది చూడాలి.