పులివెందుల పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు వైసీసీ(ycp) సోషల్ మీడియాకు గతంలో కన్వీనర్ గా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన దాదాపు 9 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ.. ఆయన కుమార్తె షర్మిల(sharmila)పై అసభ్యకర పోస్టులు పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu).. ఆయన కుమారుడు లోకేశ్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సహా వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించిన కేసులో ఏ2 భార్గవ్ రెడ్డి అన్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన విచారణను శనివారం ఎదుర్కొన్నారు. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన విచారణ సాయంత్రం ఏడు గంటల పాటు సాగింది. దీనికి పులివెందుల డీఎస్పీ కార్యాలయం వేదికగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విచారణ వేళ దాదాపు 70 ప్రశ్నల్నిసంధించినట్లుగా తెలుస్తోంది. విజయమ్మ(vijayamma).. షర్మిలపై పెట్టిన పోస్టులపై తనకేమీ తెలీదని.. గుర్తు లేదంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఈ కేసులో ఏ1గా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని భార్గవరెడ్డి ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది.
విజయమ్మ.. షర్మిలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టమని ఎవరు చెప్పారని ప్రశ్నించగా.. సమాధానాన్ని దాటవేసినట్లుగా తెలుస్తోంది. పోస్టులు పెట్టటానికి ఉపయోగించిన ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్ టాప్ లను అప్పగించాలని కోరగా.. తనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదని.. ఐఫోన్ మాత్రమే వాడతానని భార్గవ్ రెడ్డి తెలిపినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా వర్రా ఐడీలు..పాస్ వర్డ్ లు తీసుకొని మీరుపోస్టులు పెట్టారా? అని అడగ్గా.. తనకు సంబంధం లేదని పేర్కొన్నట్లు సమాచారం.
ఓ వైపు విచారణ వేళ సజ్జల భార్గవరెడ్డి ఎలాంటి సహకారాన్నిఇవ్వకపోవటం.. మరోవైపు పోలీసులు చూపిన సాంకేతిక అంశాలు.. సజ్జల సమాధానాలతో సరిపోకపోవటంతో విచారణ మరింత పీటముడిపడినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో.. తాజా విచారణ ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.