తెలంగాణ(Telangana) రాజకీయాల్లో గులాబీ బాస్ కేసీఆర్) మరోసారి తన మార్క్ వ్యూహంతో సంచలనం సృష్టించారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గ కమిటీలన్నింటినీ రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం వేళ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా, పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త ఊపిరి పోయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
గత కొంతకాలంగా నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరుపై కేసీఆర్(KCR) రహస్యంగా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. పదవుల్లో ఉండి కూడా ప్రజల్లోకి వెళ్లని వారు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని నేతలను పక్కన పెట్టడమే ఈ భారీ ప్రక్షాళన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కేవలం పేరుకే పదవులు కాకుండా, కష్టపడి పనిచేసే సైనికులకు గుర్తింపునివ్వాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పాత కమిటీలను తుడిచిపెట్టేసి, కొత్త టీమ్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు.
పార్టీలో కొత్త రక్తం ఎక్కించేందుకు కేసీఆర్(KCR) ఈసారి యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్న యువ నాయకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పోరాడే పక్కా లోకల్ సైన్యాన్ని తయారు చేయడమే కేసీఆర్ లక్ష్యంగా తెలుస్తోంది. త్వరలోనే అన్ని జిల్లాలకు నూతన కమిటీలను ప్రకటించనుండటంతో, ఎవరికి ఏ పదవి దక్కుతుందా అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
తెలంగాణ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూ, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు. ఈ ప్రక్షాళన ద్వారా పార్టీలో పేరుకుపోయిన స్తబ్ధతను తొలగించి, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆయన చూస్తున్నారు. పదవులన్నీ ఖాళీ కావడంతో ఇప్పుడు ఆశావహుల సంఖ్య పెరిగింది. మరి ఈ రిపేర్ ప్రక్రియ తర్వాత బీఆర్ఎస్(BRS) ఏ స్థాయిలో పుంజుకుంటుందో చూడాలి.