ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో గత ఐదేళ్లుగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒక్కసారిగా గర్జించారు. తన నివాసంలో సుదీర్ఘంగా సాగిన ఈడీ సోదాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఆయన, కేవలం దర్యాప్తు వివరాలు మాత్రమే కాకుండా.. ఏపీ రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండటానికి తెరదించుతూ, తన సెకండ్ ఇన్నింగ్స్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చేసిన వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం పొలిటికల్ రీఎంట్రీ. వచ్చే జూలై నెలలో తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, ఆయన తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారా అంటే.. అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొనడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది జగన్ మోహన్ రెడ్డి నాయకత్వానికి ఆయన ఇస్తున్న ప్రత్యక్ష సంకేతమా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ఒకప్పుడు వైసీపీ(YCP)లో నెం.2గా, జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న సాయిరెడ్డి, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు గుప్పించడం విశేషం. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి సరైన రీతిలో బుద్ధి చెప్పారని, ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు వాస్తవాలను గ్రహించి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. సొంత పార్టీపైనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, వైసీపీతో ఆయనకు ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మద్యం కుంభకోణం కేసులో భాగంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దాదాపు 13 గంటల పాటు ఈడీ సోదాలు జరిగాయి. ఈ సోదాల తర్వాత ఆయనలో ఆందోళన కనిపిస్తుందని అందరూ భావించారు, కానీ సాయిరెడ్డి మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించారు. "నా ఇంట్లో ఏమీ దొరకలేదు, అధికారులకు పూర్తి సహకారం అందించాను" అని చెబుతూనే.. ఈ తనిఖీల ఎపిసోడ్‌ను తన రాజకీయ పునరాగమనానికి వేదికగా మార్చుకున్నారు. మొత్తానికి, ఏపీ(AP) రాజకీయాల్లో జూలై నెలలో ఒక భారీ మార్పు చోటు చేసుకోబోతోందని సాయిరెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది. ఆయన పెట్టబోయే కొత్త పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుంది? ఎవరికి గండంగా మారుతుంది? అనే ప్రశ్నలు ఇప్పుడు అమరావతి నుంచి ఢిల్లీ దాకా హాట్ టాపిక్‌గా మారాయి.