తిరువూరు టీడీపీలో సీన్ రిపీట్..!

admin
Published by Admin — April 25, 2026 in Politics, Andhra
News Image

తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. తాజాగా మెప్మా (MEPMA) ఎన్నికల నిర్వహణ విషయంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మెప్మా కార్యాలయం వద్ద ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(Kolikapudi Srinivas) ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీకి వచ్చే నష్టం ఏంటని ఆయన ప్రశ్నించారు. గెలవాలనే ఉద్దేశంతో ఎంపీ అనుచరులు ఐదుగురు సభ్యులను కిడ్నాప్ చేశారని, మరో నలుగురు సభ్యులను వారి ఇళ్లలోనే నిర్బంధించి రౌడీలతో కాపలా పెట్టించారని కొలికపూడి ఆరోపించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకే ఎన్నికలు జరపాలని, గంటలోగా సభ్యులందరినీ తీసుకురావాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

అన్యాయంగా, అక్రమ పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తే చూస్తూ ఊరుకోనని కొలికపూడి హెచ్చరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ఆగ్రహించిన ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni) వర్గీయులు కూడా భారీ సంఖ్యలో మెప్మా కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు. సొంత పార్టీ నేతలే ఇలా వీధిపోరాటాలకు దిగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

అయితే, ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ(TDP) అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారశైలిపై ఇప్పటికే పార్టీ నాయకత్వం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించవద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా, కొలికపూడి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. పదే పదే వివాదాల్లో నిలుస్తూ, సొంత పార్టీ నేతలతోనే ఘర్షణకు దిగుతూ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేతల మధ్య ఈ గొడవలు పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయి.

Tags
Tiruvuru TDP Kolikapudi Srinivasa Rao Kesineni Chinni Andhra Politics MEPMA Elections AP News
Recent Comments
Leave a Comment

Related News