నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అంటే ఒక అన్-ప్రెడిక్టబుల్ ఫోర్స్. ఆయన కోపం ఎంత స్పీడుగా ఉంటుందో, ప్రేమ కూడా అంతే పారదర్శకంగా ఉంటుంది. కథ నచ్చితే చాలు, దర్శకుడి గతాన్ని చూడకుండా, పారితోషికం గురించి పట్టుబట్టకుండా ఓకే చెప్పేసే నైజం ఆయనది. కానీ, ఇప్పుడు బాలయ్య కోట చుట్టూ ఒక పటిష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఆ వ్యూహకర్త మరెవరో కాదు, బాలయ్య తనయ తేజస్విని.
ఒకప్పుడు బాలయ్య సినిమా అంటే కేవలం ఆయన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండేది. అయితే, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. బాలయ్య మేనరిజమ్స్‌ను మార్కెట్ వాల్యూగా మార్చడంలో తేజస్విని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఏ దర్శకుడైనా సరే, జై బాలయ్య అనడానికి ముందు తేజస్విని(Tejaswini) దగ్గర ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందే అట. ఆమె ఫిల్టర్ దాటిన తర్వాతే అది సినిమాగా పట్టాలెక్కుతోంది.
కేవలం కథల ఎంపికే కాదు, సినిమా బడ్జెట్, బాలయ్య పారితోషికం, బిజినెస్ డీల్స్ విషయంలో కూడా తేజస్విని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. బాలయ్యకు పాత దర్శకుల కంటే, ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా క్రేజీ కాంబినేషన్లు సెట్ చేయడంలో ఆమె బిజీగా ఉన్నారు. తాజాగా కొరటాల శివ(Koratala Siva)తో ప్రాజెక్ట్ ఖరారు కావడం వెనుక ఆమె మాస్టర్ మైండ్ ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్. విజయ్ కనకమేడల వంటి చిన్న దర్శకులతో సినిమా చేయాలని బాలయ్య అనుకున్నా, మార్కెట్ రేంజ్ పెంచేందుకు కొరటాల వంటి భారీ దర్శకులను లైన్లోకి తీసుకురావాలని ఆమె పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
బాలయ్య(Balayya)ను కేవలం ఒక హీరోగానే కాకుండా, ఒక పవర్‌ఫుల్ బ్రాండ్‌గా మార్చే క్రమంలో తేజస్విని ఒక మేనేజర్‌గా, ఒక స్ట్రాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ మలినేని, కొరటాల శివ వంటి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలను సమాంతరంగా సెట్ చేస్తూ, తండ్రి కెరీర్ గ్రాఫ్‌ను పీక్స్‌లో ఉంచేలా ఆమె ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్పు చూస్తుంటే, ఒకప్పుడు తండ్రి మాట విన్న కూతురు, ఇప్పుడు తండ్రికి బాస్‌గా మారి నందమూరి సామ్రాజ్యాన్ని సరికొత్తగా నడిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.