నారా లోకేశ్ ` షాడో`.. ఎవరీ కిలారు రాజేష్..?

admin
Published by Admin — April 17, 2026 in Politics, Andhra
News Image

సాధారణంగా రాజకీయాల్లో కొందరు నాయకులు మైకుల ముందు కనిపిస్తే, మరికొందరు మైండ్ గేమ్ ఆడుతూ తెరవెనుక చక్రం తిప్పుతుంటారు. అటువంటి వ్య‌క్తుల్లో కిలారు రాజేష్(Kilaru Rajesh) ఒక‌రు. గత పదేళ్లుగా నారా లోకేశ్ వెన్నంటి ఉంటూ, టీడీపీ వ్యూహరచనలో కీలక పాత్ర పోషించిన రాజేష్‌ ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా చోటు దక్కించుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అటు సోష‌ల్ మీడియాలో ఎవ‌రీ కిలారు రాజేష్‌? అంటూ ఆరాలు తీయ‌డం మొద‌లుపెట్టారు.

వాస్త‌వానికి నారా లోకేశ్‌కు కిలారు రాజేష్ క్లాస్‌మేట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్. రాజేష్, నారా లోకేశ్‌(Nara Lokesh)ల బంధం నిన్న మొన్నటిది కాదు. వీరిద్దరూ హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల నుంచే ప్రాణమిత్రులు. ఆ తర్వాత రాజేష్ అమెరికాలోని రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ పూర్తి చేసి ఆర్థికంగా మంచి స్థితిమంతుడిగా ఎదిగారు. అయితే, కేవలం స్నేహం మాత్రమే రాజేష్‌కు ఈ గుర్తింపు తీసుకురాలేదు. లోకేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాటి నుండి, ఆయన అడుగుజాడల్లో ఉంటూ ఒక నమ్మకమైన థింక్ ట్యాంక్‌లా పనిచేశారు.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు లోకేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో లోకేశ్ పక్కన ఉండి పాలనాపరమైన వ్యవహారాలను రాజేష్ పర్యవేక్షించేవారని పార్టీలో టాక్ ఉండేది. అందుకే అప్పట్లో ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆయనను ‘షాడో మినిస్టర్’ అని పిలిచేది. రాజేష్ అసలు సత్తా తెలిసింది ‘యువగళం’(Yuvagalam) పాదయాత్ర సమయంలోనే. 4000 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర రూట్ మ్యాప్ నుండి, లోకేశ్ ఇమేజ్ బిల్డింగ్, పార్టీ వార్ రూమ్ నిర్వహణ వరకు ప్రతి అంశంలోనూ రాజేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.

కేవలం పదవుల కోసమే కాకుండా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా రాజేష్ లోకేశ్‌ను విడిచిపెట్టలేదు. ఐటీ సోదాలు, డేటా చోరీ ఆరోపణలు వంటి అనేక ఇబ్బందులు ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. నిర్వాణ హోల్డింగ్స్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు పార్టీ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవహారాల్లో కలిసొచ్చింది. 2024 ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంలో తెరవెనుక రాజేష్(Rajesh) నడిపిన సోషల్ మీడియా యుద్ధం అత్యంత కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి.

రాజేష్‌కు ఆ పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. కష్టపడి పనిచేసే యువ రక్తానికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని నిరూపించారు. డేటా అనలిటిక్స్, డిజిటల్ క్యాంపెయిన్స్, యూత్ పల్స్ తెలిసిన వ్యక్తిగా రాజేష్ ఇప్పుడు. జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఒకరిగా ఎంపిక కావడంతో టీడీపీ(TDP)  భవిష్యత్ వ్యూహాలు మరింత పదునుదేలే అవకాశం ఉంది. ఒకప్పుడు లోకేష్ షాడోగా ఉన్న రాజేష్, ఇప్పుడు అధికారికంగా టీడీపీలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా మారారు.

Tags
Nara Lokesh TDP AP Politics Amaravati Kilaru rajesh TDP national general secretary
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News