రేవంత్ `కుల‌` బాంబ్‌.. ఢిల్లీ టార్గెట్‌గా బిగ్ స్కెచ్‌!

admin
Published by Admin — April 16, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మరోసారి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలో కులగణన వివరాలను బహిరంగపరచడం ద్వారా కేవలం ఒక సర్వే నివేదికను మాత్రమే కాకుండా, జాతీయ రాజకీయాలను కుదిపేసే ఒక బలమైన రాజకీయ అస్త్రాన్ని బయటకు తీశారు. ఏప్రిల్ 2026లో వెబ్‌సైట్‌లో ఉంచిన ఈ గణాంకాలు ఇప్పుడు అటు హైదరాబాద్ నుంచి ఇటు ఢిల్లీ వరకు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా జనగణన (Census) ఎప్పుడు జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం కేవలం 50 రోజుల్లోనే 1.12 కోట్ల కుటుంబాల డేటాను సేకరించి విజయవంతంగా ప్రదర్శించింది. త‌ద్వారా "రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇంత తక్కువ సమయంలో సాధ్యమైన పనిని, అన్ని వనరులున్న కేంద్రం ఎందుకు చేయడం లేదు?" అనే సూటి ప్రశ్నను రేవంత్ రెడ్డి ఢిల్లీ వైపు విసిరారు. ఇది కేవలం గణాంకాల ప్రదర్శన మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీని కులగణన అంశంపై ఆత్మరక్షణలో పడేసే పక్కా ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయనే ఆందోళన ఉంది. అయితే, ఈ శాస్త్రీయమైన కులగణన డేటా ఇప్పుడు తెలంగాణకు ఒక రక్షణ కవచంలా మారనుంది. 56 శాతానికి పైగా ఉన్న బీసీలు, మెజార్టీగా ఉన్న మాదిగ సామాజిక వర్గాల జనాభా వివరాలు చేతిలో ఉండటంతో.. కేవలం జనాభా ప్రాతిపదికనే కాకుండా, సామాజిక వర్గాల వాటా ఆధారంగా సీట్ల విభజన జరగాలనే కొత్త డిమాండ్‌ను రేవంత్ తెరపైకి తెస్తున్నారు. ఇది దక్షిణాది రాజకీయాల్లో తెలంగాణను ఒక కీలక శక్తిగా నిలబెట్టే అవకాశం ఉంది.

అదే స‌మ‌యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ డేటా అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం కానుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనకు ఈ గణాంకాలు చట్టబద్ధమైన బలాన్ని చేకూరుస్తాయి. ఏ సామాజిక వర్గం ఎంత వెనుకబడి ఉందో లెక్కలతో సహా నిరూపించడం ద్వారా, నిధుల కేటాయింపులో అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుంది. తద్వారా అణగారిన వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలనేది రేవంత్ రెడ్డి మార్క్ సోషల్ ఇంజనీరింగ్. మొత్తానికి రేవంత్ రెడ్డి వదిలిన ఈ కుల బాంబు కేవలం తెలంగాణ(Telangana)కే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ కోటా అంశాలపై పెద్ద ఎత్తున చర్చకు దారి తీసే అవ‌కాశం బ‌లంగా క‌నిపిస్తోంది. మ‌రి అభివృద్ధి మంత్రంతో ముందుకెళ్తున్న కేంద్రానికి, సామాజిక వాటా లెక్కలతో రేవంత్ వేసిన ఈ స్కెచ్ ఎలాంటి ఇబ్బందులు సృష్టిస్తుందో చూడాలి.

Tags
Telangana Caste Census Revanth Reddy Caste Census 2026 Delimitation BC Reservation Delhi
Recent Comments
Leave a Comment

Related News