రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పాత గాయాలు, పాత వివాదాలు తెరపైకి వచ్చాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Y. S. Rajasekhara Reddy) మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆ విషాద సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనను టార్గెట్ చేస్తూ అచ్చెన్నాయుడు సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమై, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయిన ఆ వేళ జగన్ ఎక్కడున్నారన్నదే అచ్చెన్నాయుడు(Atchannaidu) ప్రధాన ప్రశ్న. "రాష్ట్రమంతా తన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తుంటే, ముఖ్యమంత్రి కనిపించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతుంటే.. ఆ సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ఆయన నిలదీశారు. తండ్రి జాడ తెలియక ముందే జగన్ వైఖరి అనుమానాస్పదంగా ఉందనే రీతిలో విమర్శలు గుప్పించారు.
వైఎస్ఆర్ మరణవార్త విని తెలుగు రాష్ట్రం దిగ్భ్రాంతికి లోనైతే, జగన్(Jagan) మాత్రం అప్పుడే అధికార పీఠంపై కన్నేశారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శవం ఇంకా ఇంటికి కూడా రాకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేపట్టడం జగన్ అధికార దాహానికి పరాకాష్ట అని విమర్శించారు. ఒక కొడుకుగా తండ్రి మృతిని జీర్ణించుకోలేక బాధపడాల్సింది పోయి, కుర్చీ కోసం పాకులాడటం ఏ రకమైన సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గతంలో వైఎస్ఆర్(YSR) మృతిపై వెలువడిన అనుమానాలను కూడా ప్రస్తావించారు. వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో జగన్ సన్నిహితుడిగా ఉన్న బొత్స సత్యనారాయణే వ్యక్తం చేశారని గుర్తు చేస్తూ రాజకీయ కాక రేపారు. సొంత పార్టీ నేతలే గతంలో చేసిన ఈ ఆరోపణలకు జగన్ ఏం సమాధానం చెబుతారని అడిగారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన స్వార్థం కోసం, రాజకీయ కక్ష కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.