సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. సామాన్యులను దోచుకోవడమే కాకుండా, ఏకంగా ప్రజల తరపున అసెంబ్లీలో గళం వినిపించే ప్రజాప్రతినిధులనే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనగామ(Jangaon) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కి లక్ష రూపాయలు పోగొట్టుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రభుత్వ అధికారిని అంటూ నమ్మించి, ఏకంగా కేంద్ర పథకం పేరుతోనే ఒక ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారంటే ఆ మోసగాళ్ల స్కెచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగిందంటే?
ఒక గుర్తు తెలియని వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తనను తాను 'తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డి'గా పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వికసిత్ భారత్’(Viksit Bharat) పథకం కింద నిరుద్యోగులకు, లబ్ధిదారులకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికాడు. అయితే, దీనికి గడువు ఈరోజే ముగుస్తుందని, అత్యవసరంగా మీ నియోజకవర్గంలోని 40 మంది అర్హులైన వ్యక్తుల జాబితాను పంపాలని హుకూం జారీ చేశాడు.
తన నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరుతుందనే సదుద్దేశంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) ఆ వెంటనే స్పందించారు. అయితే, ఒక్కో అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం రూ.2,500 అవుతుందని, మొత్తం 40 మందికి కలిపి రూ.1 లక్ష వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ కేటుగాడు కోరారు. అది నిజమైన కాల్ అని నమ్మిన ఎమ్మెల్యే, నిందితుడు పంపిన నంబర్‌కు లక్ష రూపాయలు పంపారు. డబ్బులు అందిన కాసేపటికే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
జరిగింది సైబర్ మోసం(Cyber Crime) అని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారుల పేర్లతో ఇలాంటి మోసాలు జరుగుతుండటంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి స్కీమ్‌ల పేరుతో డబ్బులు అడిగితే ఎంతటి వారైనా సరే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.