జగన్ `మావిగన్` కామెడీ.. చంద్రబాబు సీరియస్ కౌంటర్!

admin
Published by Admin — April 02, 2026 in Politics, Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత ఐదేళ్లుగా మూడు రాజధానుల మంత్రం పఠించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అకస్మాత్తుగా సరికొత్త పేరును తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక ప్రక్రియ జరుగుతున్న వేళ, జగన్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదన ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

రాజధాని విషయంలో జగన్(Jagan) చెప్పిన కొత్త లాజిక్ విని రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మచిలీపట్నంలోని 'మ', విజయవాడలోని 'వి', గుంటూరులోని 'గన్' కలిపి 'మావిగన్' అనే ప్రాంతాన్ని కొత్త రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పేరు వినడానికి వింతగా ఉండటమే కాకుండా, ఆయన చెప్పిన అక్షరాల కలయిక వింటుంటే.. ఏదో హాలీవుడ్ సినిమా పేరులా ఉందంటూ నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

జగన్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandhrababu Naidu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, జగన్ తీరుపై నిప్పులు చెరిగారు. ``అమరావతి అనే పేరు పలకడానికి కూడా ఇష్టం లేకనే జగన్ ఇలాంటి వింత పేర్లు తెస్తున్నారు. మావిగన్ అనేది ఆయన ద్వేషానికి పరాకాష్ఠ`` అని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన జగన్, ఇప్పుడు ఇలాంటి కామెడీ చేయడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకవైపు రాజ్యసభలో అమరావతి(Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందుతుంటే, దానికి సమాంతరంగా జగన్ ఇలాంటి కొత్త ప్రతిపాదనలు చేయడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక కేవలం దృష్టి మళ్లించే ప్రయత్నమా అన్న చర్చ మొదలైంది. ఏది ఏమైనా, జగన్ చెప్పిన ఈ మావిగన్ థియరీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద జోక్‌గా మారిపోయింది. రాజధానిపై ఆయన వైఖరి భవిష్యత్తులోనూ మారదని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైందని తెలుగుదేశం శ్రేణులు విమర్శిస్తున్నాయి.

Tags
Mavigun AP Capital Amaravati Jagan Mohan Reddy Chandrababu Naidu Andhra Pradesh AP Politics
Recent Comments
Leave a Comment

Related News