ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన విలక్షణ నటనతోనే కాదు, సమాజంలోని అన్యాయాలపై గళమెత్తే వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన తన తల్లి స్వర్ణలత (86)ను కోల్పోయి తీరని పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మంగళవారం బెంగళూరులో ఆమె నమ్మకాలకు అనుగుణంగా క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు ముగిశాయి. అయితే, ఈ విషాద సమయంలోనూ కొందరు నెటిజన్లు ఆయన వ్యక్తిగత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
తాను నాస్తికుడినని, దేవుడిపై నమ్మకం లేదని ప్రకాష్ రాజ్ గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. దీనిని సాకుగా తీసుకున్న ఒక నెటిజన్.. ప్రకాష్ రాజ్ పాత ఇంటర్వ్యూలను, ఆయన తల్లి అంత్యక్రియల వీడియోను కలిపి పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేశారు. ``దేవుడు లేడనే వ్యక్తి, తన తల్లికి మతపరమైన అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?`` అంటూ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
``అవును, నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మకు దేవుడిపై అచంచలమైన నమ్మకం ఉంది. ఆమె విశ్వాసం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కును కాదనడానికి నేనెవరు?`` అని ఆయన ప్రశ్నించారు. ఒకరి వ్యక్తిగత నమ్మకాలను గౌరవించడమే నిజమైన మానవత్వమని చెబుతూ.. ``ద్వేషాన్ని నింపుకున్న మీలాంటి రాక్షసులకు ఈ కనీస గౌరవం గురించి అర్థమవుతుందా?`` అంటూ ట్రోలర్స్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
కాగా, ప్రకాష్ రాజ్ గతంలోనే తన కుటుంబంలోని మతపరమైన స్వేచ్ఛ గురించి స్పష్టత ఇచ్చారు. ఆయన భార్య పోనీ వర్మ హిందూ మతాన్ని అనుసరిస్తారు, తల్లి క్రైస్తవ విశ్వాసాలను కలిగుండేవారు. ``మా ఇంట్లో ఎవరి నమ్మకాలు వారివి. భార్య చేసే హోమాల్లో నేను కూర్చుంటాను, అమ్మ అడిగితే చర్చికి వెళ్తాను. వారి నమ్మకాలు ఎవరికీ హాని చేయనంత వరకు నాకు అభ్యంతరం లేదు`` అని ఆయన గతంలోనే పేర్కొన్నారు.