క్యాలెండర్ తిరగేయగానే వచ్చే ఏప్రిల్ 1(April 1) కేవలం ఫూల్స్ డే మాత్రమే కాదు, సామాన్యుడి ఆర్థిక జీవితంలో పెను మార్పులకు నాంది పలికే రోజు. దేశవ్యాప్తంగా పన్ను విధానం నుంచి రైలు ప్రయాణం వరకు కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి. వీటిపై అవగాహన లేకపోతే మీ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడమే కాదు, చేతిలో ఉన్న సొమ్ము కూడా ఆవిరయ్యే ప్రమాదం ఉంది. అసలు ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న కొత్త రూల్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.
పన్నుల రాజ్యంలో కొత్త శకం: టాక్స్ ఇయర్
ఇన్నాళ్లూ మనం విన్న ఫైనాన్షియల్ ఇయర్ కథ ముగిసిపోనుంది. 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టాన్ని పక్కన పెట్టి, ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇకపై ట్యాక్స్(Tax) ఫైలింగ్ మరింత సులభం కానుంది. ముఖ్యంగా అసెస్‌మెంట్ ఇయర్ వంటి గందరగోళ పదాలకు బదులు నేరుగా ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ రాబోతోంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తుందా లేక కొత్త చిక్కులు తెస్తుందో వేచి చూడాలి.
మీ శాలరీ స్లిప్ మారిపోతోంది!
ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. దీని ప్రకారం.. మీ బేసిక్ శాలరీ కనీసం 50 శాతంగా ఉండాలి. వినడానికి ఇది బాగున్నా, దీనివల్ల మీ చేతికి వచ్చే టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే బేసిక్ పెరిగితే మీ పీఎఫ్ (PF), గ్రాట్యుటీ కోత కూడా పెరుగుతుంది. అంటే భవిష్యత్తు కోసం పొదుపు పెరుగుతుంది కానీ, ప్రస్తుతానికి మీ ఖర్చులకు మాత్రం కోత తప్పదు.
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇన్నాళ్లూ మెట్రో సిటీలకే పరిమితమైన 50 శాతం HRA (ఇంటి అద్దె భత్యం) మినహాయింపును ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు విస్తరించారు. ఐటీ హబ్‌లలో నివసించే వేలాది మంది ఉద్యోగులకు ఇది భారీ ఊరట. అద్దె కడుతున్న వారు పన్ను రూపంలో పొందే బెనిఫిట్ ఇప్పుడు రెట్టింపు కానుంది.
ట్రేడర్లకు సెక్యూరిటీ వాత!
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసే వారికి ఏప్రిల్ 1 చేదు వార్తను మోసుకొస్తోంది. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) పెరగడంతో ట్రేడింగ్ ఖర్చులు భారంగా మారనున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ట్రేడర్లకు ఈ పెరిగిన పన్నులు మరింత భారంగా మారేలా ఉన్నాయి.
ఆధార్ ఉంటే సరిపోదు.. పాన్ కొత్త రూల్స్!
ఇకపై పాన్ కార్డు కోసం కేవలం ఆధార్ కార్డు పట్టుకెళ్తే పని జరగదు. నిబంధనలను కఠినతరం చేస్తూ ప్రభుత్వం ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి అదనపు పత్రాలను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. కేవైసీ (KYC) విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ బ్యాంక్ ఖాతాలు మొరాయించే ప్రమాదం ఉంది.
రైలు ప్రయాణికులకు రీఫండ్ షాక్!
చివరిగా.. రైల్వే(Railway) ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. రైలు బయలుదేరడానికి సరిగ్గా 8 గంటల ముందు మీరు టికెట్ రద్దు చేస్తే.. ఒక్క రూపాయి కూడా రీఫండ్ రాదు. అంతా నిలువు దోపిడీనే. 24 గంటల లోపు రద్దు చేస్తే సగం సొమ్ము వెనక్కి వస్తుంది. కాబట్టి ప్రయాణం వాయిదా వేసుకోవాలనుకుంటే 72 గంటల ముందే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.