అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో తదుపరి సుప్రీం లీడర్(supreme leader) గా ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ(mojtaba khamenie)ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ పరమైన హోదాలో నియమితమైన నిపుణుల మండలిలోని 88 మంది సభ్యులు ఆయనను ఎన్నుకున్నారు. అయితే, మజ్తబాకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయన ఎక్కువగా బయటకు రావడం లేదు. దీంతో, ఆయన కటౌట్ తోనే అభిమానులు ర్యాలీ జరిపారు. మరోవైపు, ఆయన అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో గాయపడ్డారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం మజ్తబా వయసు 57 సంవత్సరాలు. 1969, సెప్టెంబరు 8న మషాద్‌లో అయతొల్లా అలీ ఖమేనీ దంపతులకు జన్మించిన ముజ్తబా.. 1999 నుండి ఇరాన్ రాజకీయ, భద్రతా వ్యవహారాలలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. ఆయన సర్దాష్ట్, మహాబాద్‌లలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అనంతరం డిగ్రీ వరకు చదువుకుని.. ఇస్లామిక్ మత గ్రంథాలను అభ్యసించారు. 1987లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో చేరి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సేవలందించారు.
1999లో కోమ్‌లో మతాధికారిగా కొనసాగారు. 2009లో బాసిజ్ పారామిలిటరీ వాలంటీర్ మిలీషియాను తన ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా తండ్రి మరణంలో ముజ్తబా దేశ సుప్రీం లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నిపుణుల మండలి నిర్ధారించింది. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దేశాన్ని యుద్ధం నుంచి బయటకు తీసుకురావడం.. తిరిగి ఆర్థికంగా.. సైన్యం పరంగా, సాంకేతిక పరంగా కూడా దేశాన్ని నిలదొక్కుకునేలా చేయడం వంటివి ముజ్తాబ్ కు కత్తిమీద సామేనని అంటున్నారు పరిశీలకులు.
ఇరాన్(Iran) సుప్రీం లీడర్ ఎంపిక విషయంలో తాము చెప్పిందే చేయాలంటూ.. ఆది నుంచి పట్టుబడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాధిపతులు.. తాజాగా ముజ్తబాను ఎంపిక చేయడం పట్ల ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా , ఉత్కంఠగా కూడా మారింది. తమకు అనుకూలమైన నాయకులే ఇరాన్‌లో ఉండాలని ఆది నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇక, ఖమేనీ వారసులుగా ఎవరు వచ్చినా.. తాము చెప్పినట్టే వినాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కూడా తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో ముజ్తబా ఎంపిక.. ఎటు దారితీస్తుందన్నది ఆసక్తిగా మారింది.