ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న. సాధారణ రాజకీయ నాయకులకు కాదు.. ఏకంగా వైసీపీలో ఉన్న సీనియర్ల కు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదంటే.. ఆశ్చర్యం వేస్తుంది. గత 2024లో అధికారం కోల్పో యిన వైసీపీ.. ఈ రెండేళ్లలో ఏ వర్గానికి చేరువ అయింది? అంటే.. సమాధానం లభించని ప్రశ్నగానే మారింది. సహజంగా ఏ పార్టీ అయినా.. ఏడాదికే కోలుకుంటుంది. ప్రజల మధ్యకు వస్తుంది. పుంజుకుం టుంది. కానీ.. వైసీపీ పరిస్థితి ఇలా కనిపించడం లేదని సొంత నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
వ్యక్తి పూజ..!
గతంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు.. ఇటీవల వచ్చిన వారు కూడా.. పార్టీలో వ్యక్తి పూజను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కొందరికి మాత్రమే జగన్ దర్శనం లభిస్తోందని.. అక్కడ పెద్ద కోటరీ వుందని మాజీ ఎంపీ సాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి వారు చెప్పుకొచ్చారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆ తర్వాత.. అయినా మార్పు వచ్చిందా? అంటే ఇప్పటికీ లేదు.గత మూడు మాసాలుగా కొందరు మాజీలు ప్రయత్నిస్తున్నా జగన్ దర్శనం లభించడం లేదు.
కామన్ పీపుల్ టాక్ ఏంటి...!
సాధారణ పౌరులు తమకు ఉన్న సమస్యలను చెప్పుకొనేందుకు.. మాజీ మంత్రులను, మాజీ ముఖ్యమం త్రులను కూడా ఆశ్రయిస్తారు. అదేసమయంలో ప్రతిపక్షసభ్యులను కలుస్తారు. 2021-23 మధ్య ఉండవల్లి లోని చంద్రబాబు నివాసంలో ప్రత్యేకంగా వెయ్యి మంది కూర్చునేందుకు వీలుగా షెల్టర్ వేసింది.. ఇలాంటి వారికోసమే. తమ సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చేవారికి అప్పట్లో చంద్రబాబు, లోకేష్‌లు చేరువ అయ్యారు. ఇప్పుడు ఆ పరిస్థితి తాడేపల్లిలో కానీ.... మరెక్కడైనా ఉందా? అంటే లేదనే సమాధానమే వస్తోంది.
ఇంకా భ్రమలే..!
ఇప్పటికీ జగన్ భ్రమలోనే ఉన్నారని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనను చూసి.. తన పార్టీ జెండాను చూసి ఓటేస్తారని ఆయన గతంలో భావించారు. ఈ ప్రయోగం భారీగా బెడిసి కొట్టింది. ఇప్పుడు కూడా అదే పంథాలో ఉన్నారని సొంత నేతలు సైతం చెబుతున్నారు. వర్తమాన పరిస్థితులు.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.. ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలన్న విషయంపై ఆయన దృష్టి పెట్టకపోవడంతో ఇప్పటికీ ఇతమిత్థంగా ఈ వర్గం వైసీపీతోనే ఉందని చెప్పుకొనే పరిస్థితి లేకుండా పోయిందని మెజారిటీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండడం గమనార్హం.