టాలీవుడ్ రెబల్ స్టార్, గ్లోబల్ ఐకాన్ ప్రభాస్ మరోసారి అంతర్జాతీయ వేదికపై భారత్ గర్వపడేలా చేశారు. జపాన్ దేశపు అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ``అనాన్ (Anan)`` కవర్‌పై మెరిసి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో `ఆర్ఆర్ఆర్` సినిమా జపాన్‌లో సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఆ చిత్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి అనాన్ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. అయితే, ఇప్పుడు ప్రభాస్ సోలోగా ఈ మ్యాగజైన్ బ్యాక్ కవర్‌పై ఫీచర్ అయ్యారు. ఒక భారతీయ నటుడు ఒంటరిగా ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ స్పెషల్ ఇష్యూ (నెంబర్ 2483) ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మ్యాగజైన్ ఫీచర్‌ను ఇర్రెసిస్టిబుల్ ఫీలింగ్స్ థీమ్‌లో భాగంగా ``రాయల్ ఆడియన్స్ గ్రావూర్`` గా అభివర్ణించారు. అంటే జపాన్ ప్రేక్షకులు ప్రభాస్‌ను ఒక రాయల్ పర్సనాలిటీగా, తిరుగులేని ఆకర్షణ కలిగిన నటుడిగా చూస్తున్నారని స్పష్టమవుతోంది. 2025 డిసెంబర్‌లో టోక్యోలో జరిగిన ఈ ప్రత్యేక ఫోటోషూట్ కోసం ప్రభాస్ స్వయంగా అక్కడికి వెళ్లారు. అప్పట్లో తన సినిమాల ప్రమోషన్స్‌తో పాటు అభిమానులతో గడిపి వారిని ఉత్సాహపరిచారు.

జపాన్‌లో ప్రభాస్‌కు ఈ స్థాయి ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం `బాహుబలి` సిరీస్. అక్కడ ఈ సినిమా సాధించిన విజయం ప్రభాస్‌ను ఇంటింటికీ చేరువ చేసింది. ఆ తర్వాత వచ్చిన `సాహో`, `రాధే శ్యామ్`, `సలార్` వంటి చిత్రాలు కూడా జపాన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అభిమానులతో నిరంతరం కనెక్ట్ అవుతూ, వారి పట్ల చూపే ప్రేమనే ప్రభాస్‌ను అక్కడ ఒక సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ వరల్డ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపులు ఆయన క్రేజ్ ఎల్లలు దాటిందని నిరూపిస్తున్నాయి. ఇక ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.