కేంద్రం నుంచి అందిన అత్యవసర పిలుపుతో హస్తిన పయనమైన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రయాణ ఆరంభంలోనే ఊహించని అవాంతరం ఎదురైంది. షెడ్యూల్ ప్రకారం ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా, చివరి నిమిషంలో ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో టూర్‌లో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది.
ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన ప్రత్యేక విమానాన్ని టేకాఫ్‌కు ముందు తనిఖీ చేసిన సాంకేతిక బృందం, అందులోని ఎయిర్ కండిషనింగ్ (AC) వ్యవస్థలో లోపం ఉన్నట్లు గుర్తించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానంలో ప్రయాణించడం శ్రేయస్కరం కాదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది.
అయితే, ఢిల్లీ(Delhi)లో అత్యంత కీలకమైన సమావేశాలు ఉండటంతో పర్యటన ఏమాత్రం ఆలస్యం కాకుండా అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి తరలించారు. అప్పటికే బేగంపేటలో సిద్ధంగా ఉంచిన మరో ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఈ ప్రయాణంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా హైదరాబాద్ నుంచి చంద్రబాబుతో జతకట్టారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర నాయకత్వం ఏపీ అగ్రనేతలను ఢిల్లీకి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో సాంకేతిక అడ్డంకులు ఎదురైనప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గంలో వీరు హస్తిన బాట పట్టారు. ఇక ఢిల్లీ చేరుకున్న అనంతరం ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత చంద్రబాబు(CM Chandrababu) జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ ప్రెస్ మీట్‌లో కేంద్రంతో జరగబోయే చర్చలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.