టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా, ప్రయోగాత్మక చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) రూట్ మార్చబోతున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటివరకు తనదైన శైలిలో మీడియం రేంజ్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిన ఆయన, ఇకపై ఆ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేవలం భారీ బడ్జెట్, పాన్ ఇండియా రేంజ్ సినిమాలపైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని ఆయన భావిస్తున్నారట.
గత చిత్రాల అనుభవాలు, బాక్సాఫీస్ వద్ద అందిన ఫలితాలే ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణమని సమాచారం. ఇటీవల వెంకటేష్(Venkatesh)తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోయింది. బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోవడం, మరోవైపు రిలీజ్ డేట్స్ వరుసగా వాయిదా పడుతూ రావడం సినిమా రిజల్ట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అనుభవంతో అప్రమత్తమైన త్రివిక్రమ్, ఇకపై మీడియం బడ్జెట్ ప్రయోగాల కంటే.. అగ్ర హీరోలతో భారీ క్యాన్వాస్ ఉన్న ప్రాజెక్ట్‌ల వైపే అడుగులు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
ఈ నేపథ్యంలోనే ఆయన నెక్స్ట్ లైనప్‌కు సంబంధించి రకరకాల క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో త్రివిక్రమ్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, మెగాస్టార్-మాటల మాంత్రికుడి కాంబోలో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మరోవైపు, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కాల్సి ఉన్న మైథలాజికల్ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లు ప్రచారం జరుగుతోంది. టాప్ హీరోల నమ్మకాన్ని పూర్తిస్థాయిలో నిలబెట్టడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడమే లక్ష్యంగా త్రివిక్రమ్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ తాజా పరిణామాలు ఆయన కెరీర్‌ను ఏ దిశగా నడిపిస్తాయో వేచి చూడాలి.