టాలీవుడ్(Tollywood) వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా చెరగని ముద్ర వేస్తూ వస్తున్నారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. అమ్మోరు నుంచి రాజమాత శివగామి వరకు ఆమె చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్న ఆమె, వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎట్టకేలకు స్పందించారు.
దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లాడిన రమ్యకృష్ణ, కొద్దిరోజులుగా ఆయనకు దూరంగా ఉంటున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రమ్యకృష్ణ చెన్నైలో, కృష్ణవంశీ(Krishna Vamsi) హైదరాబాద్‌లో వేర్వేరుగా ఉంటుండటంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న రమ్యకృష్ణ ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చేశారు.
తాము చట్టపరంగా గానీ, మనస్పర్థలతో గానీ విడిపోలేదని, ఇప్పటికీ భార్యాభర్తలుగానే ఉన్నామని ఆమె స్పష్టం చేశారు. అయితే వృత్తిపరమైన బాధ్యతలు, కెరీర్ పరిస్థితులరీత్యా వేర్వేరు నగరాల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. తమ కుమారుడి చదువు, ఆరోగ్యం నిమిత్తం చెన్నైలో ఉండాల్సి రావడం, ఆ తర్వాత పరిస్థితులు అలా సర్దుబాటు కావడంతోనే ఈ దూరం ఏర్పడిందని క్లారిటీ ఇచ్చారు. రోజూ విభేదాలతో గొడవలు పడటం కంటే, మంచి స్నేహితులలా సర్దుకుపోతూ జీవించడమే తమకు ప్రశాంతతనిస్తోందని రమ్యకృష్ణ(Ramya Krishnan) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.