ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లకు తిరుగులేని విజయాలను అందించిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. దశాబ్ద కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఆయనకు గత పదేళ్లలో చెప్పుకోదగ్గ విజయం లేదు. ఆ సినిమా కూడా ఫ్లూక్ హిట్ అనిపించేలా తర్వాత వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఆయనకు టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోలు కూడా దొరకని పరిస్థితి తలెత్తింది.
ఇలాంటి సమయంలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి డేట్లు సంపాదించి ‘స్లమ్ డాగ్’ సినిమా చేశాడు పూరి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. కానీ ఎంతకీ విడుదలకు నోచుకోవడం లేదు. పూరి ఎంత ప్రయత్నిస్తున్నా ఆ సినిమాకు మోక్షం కలగడం లేదు. సినిమా పాతబడిపోకుండా ఉండడం కోసం.. ఈ మధ్యే గుమ్మడికాయ కొట్టినట్లు కూడా ఏదో మేనేజ్ చేశారు కానీ, తెర వెనుక ఏం జరుగుతోందన్నది ఇండస్ట్రీ జనాలకు బాగానే తెలుసు.
ఒకవైపు లైగర్, ఇంకోవైపు డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్ వివాదాలు ముసురుకుని ఉండడం వల్లే ‘స్లమ్ డాగ్’ బయటికి రావడం లేదన్నది స్పష్టం. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాకు భారీ మొత్తంలో ఫైనాన్స్ చేసిన తమను పూరి, ఛార్మి ఎలా మోసం చేశారో ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ యజమాని చైతన్యరెడ్డి చెప్పారు. ఆమెతో పాటు ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకేవైపేమో ‘లైగర్’ బాధితులకూ సెటిల్మెంట్ చేయాల్సి ఉంది. దాని ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని.. పూరి, స్లమ్ డాగ్ అని పేర్లు పెట్టకుండా ఈ సినిమా భవితవ్యం గురించి కుండబద్దలు కొట్టేశారు. సదరు డైరెక్టర్ గత రెండు సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్ చేయకుండా సినిమా రిలీజ్ కాదని అతను తేల్చేశాడు. ఒక్క సినిమాతో రెండు సినిమాల బయ్యర్లకు సెటిల్ చేయడం సాధ్యమా అని అతను సందేహం వ్యక్తం చేశాడు. చివరి సినిమా బాధితులకు సినిమాను ఇస్తే.. వాళ్లు అంతకుముందు సినిమా వాళ్లతో ఏదైనా మాట్లాడుకుండా ఇది క్లియర్ అయ్యే ఛాన్సుందన్నాడు. అదే సమమంలో కొత్త సినిమా కోసం తెచ్చిన ఫైనాన్స్ సంగతేంటి అని ధీరజ్ ప్రశ్నించాడు. ఇది ఎలా క్లియర్ చేస్తారన్నాడు. ఇలా ఎన్నో చిక్కుముడులతో మూడిపడ్డ ఈ చిత్రం విడుదల కావడం చాలా కష్టమని ధీరజ్ తేల్చేశాడు. మరి ఇన్ని సమస్యలను దాటుకుని ‘స్లమ్ డాగ్’ అసలు విడుదలకు నోచుకుంటుందా అన్నది ప్రశ్న.