ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని.. సతీమణి, టీడీపీ నాయకురాలు.. పులివర్తి సుధ స్థానిక ఎన్నికల సమయంలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ.. ఆమె వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేయడం.. ఆయన ఎటు వెళ్తే.. తాను కూడా అటే వెళ్లడం వంటివి సంచలనంగా మారి.. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చాయి. కాగా.. తాజాగా కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి రూరల్ జడ్పీటీసీగా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. సుమారు 600 ఓట్ల మెజారిటీతో హర్షిత్ గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా సుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ``చెవిరెడ్డి కుటుంబం అడుక్కుంటే.. భిక్షమేశాం.`` అని ఆమె అన్నారు. అంతేకాదు.. ``చెవిరెడ్డి పెద్దకొడుకు గత ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఓడిపోతే.. ఫ్రెస్ట్రేషన్‌కు పోతాడని మేమే వదిలేశాం`` అని సుధ వ్యాఖ్యానించారు.
"చెవిరెడ్డి కుటుంబం అడుక్కుంటే తామే ఆ సీటును భిక్ష వేసాము" అంటూ తీవ్రస్థాయిలో సుధ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. తిరుపతి రూరల్ మండల పరిధిలో కౌంటింగ్ సమయంలో రీకౌంటింగ్ అడగకుండా వదిలేసి తాము తప్పు చేశామని, లేదంటే ఫలితం మరోలా ఉండేదని ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి 41,119 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి టీడీపి అభ్యర్థి ముచేలి ధనలక్ష్మికి 40,517 ఓట్లు వచ్చాయి. మొత్తం 14 రౌండ్ల పాటు ఉత్కంఠ మధ్య హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరి వరకు ఆధిక్యాలు మారుతూ వచ్చి, అంతిమంగా హర్షిత్ రెడ్డి విజయం దక్కించుకున్నారు.
అంతకుముందు జరిగిన పోలింగ్ రోజున కూడా మంగళం పోలింగ్ కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పులివర్తి సుధారెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెవిరెడ్డి ఓటర్లను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి తాను ఎస్కార్ట్‌గా వస్తానని, ఇద్దరం ఒకే కారులో తిరుగుదామంటూ ఆమె సవాల్ విసిరారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒక "పెద్ద డ్రామా ఆర్టిస్ట్" అని అభివర్ణిస్తూ, గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకున్నారని సుధారెడ్డి ఆరోపించారు. మొత్తంగా చంద్రగిరిలో రాజకీయం వేడివేడిగానే ఉండడం గమనార్హం.