వైసీపీ అధినేత జగన్పై బీజేపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. ``జగన్.. ఓ శకుని, శిఖండి.. ఉన్మాది. తల్లీ,చెల్లికి ద్రోహం చేసినవాడు.`` అంటూ.. తనదైన శైలిలో రెచ్చిపోయారు. తీవ్ర వ్యాఖ్యలు , విమర్శలతో వేడెక్కించారు. ఇటీవల కాలంలో జగన్పై ఈ రేంజ్లో బీజేపీ నాయకులు ఎవరూ విమర్శలు చేయక పోవడం గమనార్హం. అలాంటిది ఒక్కసారిగా సత్యకుమార్ ఇంతగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. దీనికి కారణం.. జగన్ మీడియాలో సత్యకుమార్ ను టార్గెట్ చేస్తూ.. కథనాలు ప్రచారం చేయడమేనని తెలిసింది.
సత్యకుమార్ ఏమన్నారంటే..
ఎన్నికల్లో ఎదురయ్యే పరాజయాన్ని జీర్ణించుకోలేక జగన్ రాజకీయాల్లో శకుని పాత్ర పోషిస్తున్నారని మంత్రి సత్యకు మార్ విమర్శించారు. సొంత సోదరి కుమార్తె వివాహానికి ఆమె ఇంటినే ఇచ్చేందుకు కూడా అంగీకరించని వ్యక్తి, రాజకీయాల్లో మాత్రం శకునిలా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత ప్రసార మాధ్యమాల ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తూ వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేయడం జగన్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని దుయ్యబట్టారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక వ్యక్తుల పేర్లతో తప్పుడు ప్రచారాలు చేయించడం, ఆడియోలోని సారాంశాన్ని వక్రీకరించి రాజకీయ గందరగోళం సృష్టించడం జగన్కు అలవాటుగా మారిందని మంత్రి విమర్శించారు. ధర్మవరంలో రెండేళ్ల కిందట కలవల రాము స్థల వివాదంలో న్యాయం చేయాలని కోరుతూ మాట్లాడిన అంశాలను వక్రీకరించి, తాను బెదిరించినట్లు ఇప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరించి రాజకీయాలకు ముడిపెట్టడం ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు.
తాను ఇటీవల అనంతపురంలో ఉద్యోగులతో మాట్లాడుతూ.. వారి సమస్యల పరిష్కారానికి అనుకూలంగా స్పందిస్తే, బెదిరించినట్లు జగన్ సొంత మీడియా ద్వారా ప్రచారం చేయించారని మంత్రి గుర్తు చేశారు. అయితే స్వయంగా ఆనాటి ఉద్యోగులే ఆ ప్రచారాన్ని ఖండించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా శిఖండిలా తెరవెనుక ఉండి తన మీడియా ద్వారా వ్యక్తులపై బురదజల్లడం జగన్కు అలవాటుగా మారిందని విమర్శించారు.
వైశ్యుల పేర్లను రాజకీయ వివాదాల్లోకి లాగి వారి ఓట్లను పొందాలని చూడటం రాజకీయ రాక్షస క్రీడ అని సత్యకుమార్ యాదవ్ దుయ్యబట్టారు. విజయవాడలో చేనేత కార్మికుడిని కిడ్నాప్ చేసి కొట్టిన ఘటనపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో చేనేత కార్మికుడిని హత్య చేసింది ఎవరో ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు కులాల పేరుతో సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేయడం ఏమిటని నిలదీశారు.
ఇతరులకు నీతులు చెప్పే ముందు జగన్ తన కుటుంబ సంబంధాల విషయంలో అనుసరించిన వైఖరిపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని మంత్రి అన్నారు. సొంత తల్లి, సోదరి విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాలకు దిగడం తగదన్నారు. సొంత మేనమామగా కూడా బాధ్యతలు నిర్వర్తించలేని వ్యక్తికి ఇతరులకు నీతులు చెప్పే హక్కు ఎక్కడిదని సత్యకుమార్ ప్రశ్నించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు ఆర్జించిన జగన్, తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించారని మంత్రి ఆరోపించారు. ఆర్థిక నేరగాడిగా, ఉగ్రవాదిగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థులు డబ్బు ఖర్చు పెట్టబోతున్నారని ప్రచారం చేయడం అవివేకమని మండిపడ్డారు. తెరవెనుక శకునిలా రాజకీయ కుట్రలు చేస్తూ, శిఖండిలా ఇతరుల వెనుక దాక్కొని ఆరోపణలు చేయడం మానుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.