ఏపీ స్థానిక పోరు.. కాంగ్రెస్ చేతులెత్తేసిందా.?

admin
Published by Admin — October 16, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. అదే స్థానిక సంస్థల ఎన్నికల(AP Local Polls) రణం. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో గ్రౌండ్‌లోకి దూసుకుపోతుంటే.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించిన ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఎక్కడా కనిపిచడం లేదు. దీంతో ఏపీ స్థానిక పోరులో కాంగ్రెస్ ముందే చేతులెత్తేసిందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే వేదిక. కానీ, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌(Congress)లో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పోగొట్టుకున్న పట్టును తిరిగి సాధించాలని, కనీసం ఉన్న ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవాలని అధిష్టానం భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆచరణ మాత్రం శూన్యంగా మారింది. పార్టీలో నెలకొన్న తీవ్రమైన స్తబ్దత నేతలను, కార్యకర్తలను తీవ్ర నిరాశలోకి నెడుతోంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడటంలోనూ, శ్రేణులను సమన్వయం చేయడంలోనూ నాయకత్వం పూర్తిగా వెనుకబడింది. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినా ఒరిగింది ఏమీ లేదు. పేరుకు కమిటీ ఉందే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి కీలక సమావేశాలు నిర్వహించలేదు, వ్యూహాత్మక అడుగులు పడలేదు. అసలు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకం చేసే ప్రయత్నమే జరగడం లేదు. దీంతో జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

షర్మిల బిజీ.. పట్టించుకోని పెద్దలు
పార్టీని ముందుండి నడిపించాల్సిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) వ్యక్తిగత బిజీలో ఉండిపోవడం పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కుమార్తె వివాహ ఏర్పాట్లలో ఆమె బిజీగా ఉండటంతో పార్టీ కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నారు. కేవలం కొన్ని ప్రత్యేక నిరసన కార్యక్రమాలకు వచ్చి వెళ్లడం మినహా, స్థానిక ఎన్నికలపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఇక పళ్లం రాజు, రఘువీరారెడ్డి వంటి సీనియర్ నేతలు సైతం ఈ పరిణామాలను పెద్దగా పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఈ విధంగా పూర్తిగా సైలెంట్ అయిపోవడం పరోక్షంగా కూటమికి పెద్ద లాభం చేకూరుస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. తటస్థ ఓటర్లు ఇప్పటికే కూటమి వైపు మొగ్గు చూపుతుండగా.. గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పడిన నామమాత్రపు ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు కూటమి ఖాతాలోనే పడే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. మొత్తానికి, సరైన కార్యాచరణ లేక, నాయకుల సమన్వయ లోపంతో ఏపీ(AP)లో కాంగ్రెస్ పార్టీ స్థానిక పోరుకు ముందే చేతులెత్తేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags
AP Local Elections Andhra Pradesh Congress AP Politics YS Sharmila Raghuveera Reddy AP News Local Body Polls
Recent Comments
Leave a Comment

Related News