టీడీపీతో సీట్ల లొల్లి.. జనసేన తప్పటడుగు.!

admin
Published by Admin — October 14, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల(AP Local Body Elections) సమరం వేడెక్కుతున్న వేళ, అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు రగడ తారాస్థాయికి చేరింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన సమయంలో, మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధం రోడ్డుకెక్కడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో పార్టీ బలంపై పూర్తి అంచనా లేకుండా, కేవలం ఒత్తిడి రాజకీయాలకే పరిమితం కావడం జనసేన పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలేలా చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 40 శాతం సీట్లు కావాలంటూ జనసేన(Janasena) కీలక నేతలు బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడం కూటమిలో కలకలం రేపింది. ఒకవైపు సీట్ల పంపకాలపై తెరవెనుక చర్చలు జరుగుతున్న తరుణంలో, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులే ఈ విధంగా బహిరంగ ప్రకటనలు చేయడం సమంజసమనిపించుకోదు. అయితే, మిత్రపక్షాలను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా రిజర్వేషన్లు ప్రకటించడం ఏంటని జనసేన శ్రేణులు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ పరస్పర వాదనలతో సోషల్ మీడియాలో కూటమి పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.

ఈ సీట్ల పంచాయితీ ఎంతకీ కొలిక్కి రాకపోవడమే ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడటానికి ప్రధాన కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం విజయవాడ(Vijayawada)లో ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినప్పటికీ, చివరి నిమిషంలో దానిని మధ్యాహ్నానికి మార్చడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల చిక్కుముడి వీడకపోవడం వల్లే ప్రభుత్వ వర్గాల సూచన మేరకు ఈ వాయిదా జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి త్యాగాలకు సిద్ధంగా లేమని జనసేన గట్టిగా చెబుతున్నప్పటికీ, ఆ పార్టీ అవలంబిస్తున్న వ్యూహంపై సొంత వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. పోటీ చేసేందుకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పించడం ఆ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని కళ్లకు కడుతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పార్టీలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయడంపై దృష్టి పెట్టి ఉంటే, ఈనాడు టీడీపీ ముందు సీట్ల కోసం భిక్షాదేహిలా నిలబడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు.కేవలం సీట్ల కోసం ఇంత తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, చివరికి ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను లాక్కుని తమ అభ్యర్థులుగా బరిలో నిలపాలని చూస్తే అది జనసేనకు ఏమాత్రం గర్వకారణం కాదు. స్వశక్తిపై ఎదగాల్సిన ప్రాంతీయ పార్టీ, మిత్రపక్షం దయపై ఆధారపడటం భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద మూల్యమే చెల్లించేలా చేస్తుంది. టీడీపీ(TDP)తో ఈ సీట్ల లొల్లిలో జనసేన వేస్తున్న అడుగులు ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయా? లేక వ్యూహాత్మక విజయాలను ఇస్తాయా? అనేది రాబోయే కాలమే నిర్ణయించనుంది.

Tags
TDP JanaSena AP Local Body Elections 2026 Andhra Pradesh AP Politics Pawan Kalyan Chandrababu
Recent Comments
Leave a Comment

Related News