పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్(పీపీపీ)తోనే భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులు ముడిపడి ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ అంటే అర్థం తెలియని వారు మాత్రమే దానిని వ్యతిరేకిస్తారని.. తెలిసిన వారు స్వాగతిస్తారని వ్యాఖ్యానించారు. తాజాగా బుధవా రం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చించారు. దీనిలో పీపీపీని కీలకంగా చేసుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగులో ఉన్నాయన్న ఆయన.. వాటిని పూర్తి చేయాలంటే.. కొన్ని సంవత్సరా ల సమయం పడుతుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పీపీపీ విధానం సరైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ``అన్నీ ప్రభుత్వమే చేయాలంటే కుదరదు. దీనికి ఏళ్ల సమయం పడుతుంది. పీపీపీ విధానంలో అయితే.. ఆరేడు మాసాల్లోనే పూర్తి చేయొచ్చు. తద్వారా.. ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఈ విధానంపై అవగాహన లేని వారే మాట్లాడుతున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి అనుకూలంగానే మన ప్రభుత్వం పనిచేస్తుంది`` అని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రెండు ప్రాజెక్టులను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది.
1) పిడుగురాళ్ల వైద్యకళాశాల. 2) గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ పనులను పీపీపీకి ఇచ్చేలా మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక, ఇదేసమయంలో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపైనా కేబినెట్ చర్చించింది. దీనిపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇచ్చిన నివేదిక ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని.. ఇది వెలుగు చూసిన తర్వాత.. వైసీపీ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఇక, ఇతర విషయాలపైనా చర్చించిన ఆయన.. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.