ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ... ఆ సమయంలో వ్యవహరించిన తీరు.. అనుసరించిన విధానాలు కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పటికీ సరిదిద్దుకోని లక్షణం వంటివి ఆ పార్టీకి మైనస్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అలాంటి ఘటనలపైనే ఏమీ తెలియని.. పవిత్ర మనసుతో వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా వ్యవహరించడం.. ``అలా కాదు.. ఇలా చేయండి``అంటూ సూచనలు సలహాలు ఇవ్వడం వంటివి అందరి ని నవ్వేలా చేస్తున్నాయి.
1) అమరావతి: రాజధాని విషయంలో ఆది-మధ్య-అంతిమ అన్నట్టుగా వైసీపీ వ్యవహరించింది. ఆదిలో రాజధానికి అనుకూలమని విపక్ష నాయకుడిగా జగన్ చెప్పారు. ఇక, మధ్యలో అధికారంలోకి వచ్చాక.. మూ డు రాజధానులు అంటూ.. మాట్లాడారు. రాజధానిపై కత్తికట్టినట్టు వ్యవహరించారు. ఇక, మరోసారి అధికా రం కోల్పోయాక.. ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. రాజధానికి తాము అనుకూలమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాజధాని బిల్లుకు కూడా మద్దతు ఇస్తామని ప్రకటించడం విశేషం. మరి వైసీపీని ఎలా నమ్మాలి?
2) రైతులు: తాజాగా వైసీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు.. రాజధాని రైతులపై కన్నీరు పెట్టుకున్నంత పనిచేశారు. ఆ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. అంతేకాదు.. రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లులో రైతుల ప్రయోజనాలను కూడా జత చేయాలని పేర్కొన్నారు. అప్పుడుతాము సదరు చట్టబద్ధత బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కానీ, అధికారంలో ఉండగా.. అదే రైతులపై లాఠీ ప్రయోగం చేసింది ఎవరు? రైతుల ఉద్యమాలను నాటకాలతోనూ.. డ్రామాలతోనూ.. పెయిడ్ వర్కర్లతోనూ పోల్చింది ఎవరు? అనేది కూడా వైసీపీ చెప్పాలి.
3) శ్రీధర్ ముచ్చట: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై వైసీపీ ఘాటుగా స్పందించింది. జన సేన ఎమ్మెల్యేపై చర్యలు ఏవంటూ నిలదీసింది. అయితే.. ఇదే వైసీపీ హయాంలో అదే సీమకు చెందిన అప్పటి ఎంపీ ఒకరు న్యూడ్ వీడియోలతో చెలరేగిపోయాడు.. అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలా వ్యవహరించారు? అప్పట్లో నిజానికి చర్యలు తీసుకుని ఒక ఆదర్శాన్ని ఏర్పాటు చేసి ఉంటే.. ఇప్పుడు వైసీపీకి మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ, తమ ప్రభుత్వంలో ఒకలా.. ఇప్పుడు మరోలా వ్యవహరించడంతోనే వైసీపీ మరింత పలుచన అవుతోంది.