జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, డైరెక్ట్ గా బాధిత మహిళ ఓ మీడియా ఛానెల్ లో లైవ్ లో ఆరోపణలు చేసి వీడియోలు, స్క్రీన్ షాట్లు చూపించడం సంచలనం రేపింది. అయితే, ఈ వ్యవహారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ముందే తెలుసా? తెలిసి కూడా పవన్ ఈ ఇష్యూను సెటిల్ చేయలేకపోయారా? అన్న ప్రశ్నలను సోషల్ మీడియాలో కొందరు జనసైనికులు లేవనెత్తుతున్నారు.
ఈ నెల 22న జనసేన నేతలకు కొన్ని విషయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరి ప్రసాద్ ఓ లేఖ విడుదల చేశారు. వివాహేతర సంబంధాల రచ్చను పార్టీపై రుద్దాలని కొందరు చూస్తున్నారని, అందుకోసం మార్గాలను అన్వేషిస్తున్నారని పవన్ చెప్పారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిచాల్సి ఉందని పవన్ చెప్పినట్లు ఆ లేఖలో తెలిపారు. ఆ లేఖ విడుదలైన 4 రోజుల తర్వాత ఆ మహిళ ఆరోపణలు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ లెటర్ మీద సోషల్ మీడియాలో రచ్చ..చర్చ జరుగుతోంది. ఆ లెటర్ లో వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దడం అనే పాయింట్ ను పవన్ మెన్షన్ చేయడం బ్లండర్ మిస్టేక్ అని కొందరు జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ హయాంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం సమయంలో బాధిత మహిళ ఇలా మీడియా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు. గోరంట్ల వివాహేతర సంబంధాన్ని వైసీపీ మీద రుద్దిన విషయాన్ని కామెంట్ చేస్తున్నారు.
ఇప్పుడు మాత్రం వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దేందుకు కొందు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రచారాలను ఖండించాలని జనసైనికులకు పవన్ డైరెక్ట్ గా పిలుపునివ్వడంతో జనసేనకు డ్యామేజ్ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. చివరకు అరవ శ్రీధర్ మీద విచారణ కమిటీ వేయాల్సి వచ్చిందని, విచారణ జరిపి ఆ ఆరోపణలు నిజమని తేలితే శ్రీధర్ పై చర్యలు తీసుకొని ఉంటే జనసేన పార్టీకి, పవన్ కు డ్యామేజీ జరిగేది కాదని అంటున్నారు. శ్రీధర్ విషయాన్ని పవన్ సీరియస్ గా తీసుకొని సెటిల్ చేసి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని కామెంట్స్ చేస్తున్నారు.