టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం తన తదుపరి అడుగుల విషయంలో సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణతో `అఖండ 2` తీసి హిట్ కొట్టిన ఈ దర్శకుడు, ఆ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి `సరైనోడు` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. బోయపాటి కథ సిద్ధం చేసినా, బన్నీ లైనప్ సందీప్ రెడ్డి వంగా, అట్లీ వంటి భారీ ప్రాజెక్టులతో లాక్ అయి ఉంది. దీంతో ఈ గ్యాప్‌లో బోయపాటి తన రూట్ మార్చినట్లు తెలుస్తోంది.
తెలుగులో టాప్ హీరోలందరూ వచ్చే రెండేళ్ల వరకు బిజీగా ఉండటం, యంగ్ హీరోలు బోయపాటి రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను తట్టుకోవడం కష్టమనే అభిప్రాయంతో ఆయన బాలీవుడ్ వైపు చూస్తున్నారట. అక్కడ బోయపాటి మార్క్ ఊర మాస్ మేకింగ్‌కు సరైన జోడీగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ కనిపిస్తున్నారు. రణవీర్ బాడీ లాంగ్వేజ్, ఆయన చూపించే అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్‌కు బోయపాటి ఎలివేషన్లు తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
గత కొంతకాలంగా రణవీర్ సింగ్ కూడా ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్‌తో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని తహతహలాడుతున్నారు. గతంలో కొందరు దర్శకులతో చర్చలు జరిపినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే, బోయపాటి ఇటీవల వినిపించిన లైన్ రణవీర్‌కు బాగా నచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఆడియన్స్‌కు నచ్చేలా ఒక భారీ యాక్షన్ డ్రామాను వీరిద్దరూ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.