భార్య అందంగా ఉంద‌ని భ‌ర్త‌కు సెక్రటరీ పదవి.. ఏంటిది ట్రంప్ మామ!

admin
Published by Admin — January 30, 2026 in Politics, International
News Image

ప్రపంచ దేశాలన్నింటికీ అమెరికా అంటే ఒక పెద్దన్న. అక్కడ ఏదైనా పదవి దక్కాలంటే ఆ వ్యక్తికి మేధస్సు ఉండాలి, అపారమైన అనుభవం ఉండాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు. ట్రంప్ కేబినెట్‌లో సీటు కావాలంటే ఐక్యూ కంటే లుక్స్ ముఖ్యం. తాజాగా అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వింటే.. ``ఇదేందయ్యా ఇది.. నేను ఎప్పుడూ చూడలేదు`` అని సామాన్యులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

డగ్ బర్గమ్ నియామకంపై ట్రంప్ వింత వైఖ‌రి ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. అస‌లేం జ‌రిగిందంటే.. బర్గమ్ భార్య క్యాథరిన్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను ట్రంప్ చూశారట. ఆ వీడియోలో ఆమె అందానికి ఆయన ముగ్ధులయ్యారట. వెంటనే తన స్టాఫ్ ని పిలిచి.. ``ఎవరామె? అంత అందంగా ఉంది!`` అని ఆరా తీశారట. ఆమె డగ్ బర్గమ్ భార్య అని తెలియగానే, ఇక ఆలస్యం చేయకుండా ఆయనకు సెక్రటరీ పదవిని ఆఫర్ చేసేశారట. 

డగ్ బర్గమ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం కావచ్చు, రెండుసార్లు గవర్నర్‌గా పని చేసి ఉండొచ్చు.. కానీ ట్రంప్ దృష్టిలో అవన్నీ సిల్లీ రీజన్స్. భార్య అందంగా ఉంటేనే భర్త విజయవంతమైన పురుషుడు అనేది ట్రంప్ థియరీ. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఆ దంపతుల ముందే స్టేజ్ మీద చెప్పడం ట్రంప్ కే చెల్లింది. ``బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుంది.. అందుకే ఆయనకు ఈ పదవి ఇచ్చాను`` అని ట్రంప్ అంటుంటే.. పక్కనే ఉన్న బర్గమ్ నవ్వాలో, ఏడవాలో అర్థం కాక తెల్లముఖం వేశారు. పాపం, తన కష్టానికి దక్కిన గుర్తింపు కంటే భార్య గ్లామర్‌కే ఎక్కువ వెయిటేజ్ దక్కిందని ఆయనకు అప్పుడే అర్థమై ఉంటుంది.

ఈ సంఘ‌ట‌న‌తో ట్రంప్ దృష్టిలో మహిళలు అంటే కేవలం ఫోటో షూట్లకు, అందాల పోటీలకు పరిమితమైన వారు మాత్రమేనా అనే అనుమానం మరోసారి బలపడింది. ఒక బాధ్యతాయుతమైన పదవిని భర్తీ చేసేటప్పుడు కూడా మహిళల రూపురేఖలను ప్రామాణికంగా తీసుకోవడం ఆయన అహంకారానికి, మహిళల పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనం. గతంలోనూ మహిళలపై నోరు పారేసుకున్న ట్రంప్, ఇప్పుడు ఏకంగా కేబినెట్ నియామకాలను కూడా బ్యూటీ కాంటెస్ట్ రేంజ్‌కు దిగజార్చారు. ఇది చూసిన నెటిజన్లు, ``రేపు పొద్దున్న ఎవరైనా మంత్రి అవ్వాలంటే ముందు వాళ్ళ భార్యల ఫోటో షూట్ పంపాలేమో`` అంటూ ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

Tags
Trump Donald Trump Doug Burgum White House US Politics
Recent Comments
Leave a Comment

Related News