ఏపీలో మ‌రో 4 కొత్త ఎయిర్‌పోర్టులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

admin
Published by Admin — January 30, 2026 in Andhra
News Image

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణం మరింత చేరువ కానుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం!
పశ్చిమ గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కు అందజేయడంతో ప్రాథమిక ప్రక్రియ ప్రారంభమైంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ సానుకూలంగా స్పందించారు.

కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలుపై క్లారిటీ..!
రాష్ట్రంలోని మరో మూడు కీలక ప్రాంతాలైన కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ముందడుగు పడింది. ఈ ప్రాంతాల్లో ఏఏఐ ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసిన‌ట్లు కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ విధానం కింద వీటికి అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర పరిశీలనలో ఉన్నాయ‌ని మురళీధర్ మోహోల్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాలు వస్తే కనెక్టివిటీ పెరగడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి ఏపీలో ఎయిర్‌పోర్టుల నెట్‌వర్క్ విస్తరణ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగానే కసరత్తు చేస్తున్నాయి. అనుమతులు పూర్తయి ఇవి అందుబాటులోకి వస్తే సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం మరింత సులభతరం కానుంది.

Tags
AP Airports Andhra Pradesh New Airports Greenfield Airports AAI Aviation News
Recent Comments
Leave a Comment

Related News