మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా ఉద్యోగస్తులైన దంపతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోందా? వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అదే ‘ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్’. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే, దేశంలోని లక్షలాది మంది ఉద్యోగ జంటలకు పన్ను పోటు నుంచి భారీ ఉపశమనం లభించనుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లయితే, వారిని విడివిడి వ్యక్తులుగా పరిగణించి ఆదాయపు పన్ను లెక్కిస్తారు. దీనివల్ల ఇద్దరూ వేర్వేరుగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది. అయితే, కొత్తగా వస్తున్న ఆలోచన ప్రకారం.. కుటుంబాన్ని ఒకే యూనిట్ గా పరిగణిస్తారు. అంటే భార్యాభర్తల ఆదాయాన్ని కలిపి ఒకే మొత్తంగా చూసి, దానిపై పన్ను మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇద్దరు కలిసి కట్టే పన్ను కంటే, జాయింట్‌గా కట్టే పన్ను గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
ఈ జాయింట్ టాక్సేషన్ విధానం వల్ల వారి చేతిలో మిగిలే నికర ఆదాయం పెరుగుతుంది. విదేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్న ఈ విధానంపై కేంద్రం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల కుటుంబాల కొనుగోలు శక్తి పెరిగి, ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, భారత పన్నుల చరిత్రలో ఇలా కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని పన్ను విధించడం ఇదే మొదటిసారి కానుంది. ఒకవేళ భర్త ఆదాయం ఎక్కువగా ఉండి, భార్య ఆదాయం తక్కువగా ఉన్నా.. లేదా వైస్-వెర్సా జరిగినా.. ఉమ్మడి ఆదాయంపై స్లాబులు మారడం వల్ల టాక్స్ బెనిఫిట్ భారీగా ఉంటుంది. మరి ఈ ప్రతిపాదన బడ్జెట్‌లో కార్యరూపం దాల్చుతుందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది గనుక అమలైతే, మధ్యతరగతి దంపతులకు నిర్మలమ్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లే అవుతుంది.